కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇక ఢిల్లీలో మాస్కులను ధరించకపోతే రూ.500 ఫైన్ ను కాస్తా రూ.2వేలకు పెంచి వసూలు చేస్తున్నారు. అలాగే వివాహాది శుభ కార్యాలకు వచ్చే అతిథులు, నైట్ కర్ప్యూలు, 144 సెక్షన్ వంటి వాటిని ఢిల్లీతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు.
కాగా రాష్ట్రాలు తీసుకుంటున్న లాక్ డౌన్ తరహా నిర్ణయాలతో మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై చర్చ నడుస్తోంది. ప్రధాని మోదీ మళ్లీ దేశంలో లాక్ డౌన్‌ను విధిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మోదీ తాజాగా రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించడం ఆ అంశానికి మరింత ఊతమిచ్చినట్లయింది. కరోనా నేపథ్యంలో మళ్లీ మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపు ఇస్తారని అంతటా ప్రచారం జరుగుతోంది. అయితే మళ్లీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తే భారత్ తట్టుకుంటుందా ? ఇప్పటికే భారీగా నష్టపోయిన భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుంటుందా ? అంటే.. అందుకు లేదు.. అనే సమాధానం వస్తోంది.
కరోనా నేపథ్యంలో అన్ని రకాల వ్యాపారాలు, రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మళ్లీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. కరోనా ముందున్న స్థితికి ఇంకా అన్ని రంగాలు, వ్యాపారాలు చేరుకోలేదు. ఇంకా కొన్ని రంగాలకు చెందిన కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభం కానేలేదు. ఉదాహరణకు టూరిజం, పార్కులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, షాపింగ్ సెంటర్లు, థీమ్ పార్కులు, మ్యూజియంలు, లైబ్రరీలు, సినిమా థియేటర్లు.. వంటివి కొన్ని చోట్ల ఓపెన్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా కార్యకలాపాలు జరగడం లేదు.
అలాగే వ్యాపారాలు, హోటల్ కార్యకలాపాలు, క్రీడలు తదితర ఇతర రంగాల్లోనూ ఇంకా కార్యకలాపాలు పూర్తిగా కొనసాగడం లేదు. ఇప్పటికీ ఇంకా అనేక రంగాలు, వ్యాపారాలు నష్టాల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుందని నిపుణులు అంటున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ను భారత్ తట్టుకోలేదని, అప్పుడు ఊహించని తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని అంటున్నారు.
అయితే కేంద్రం ఇప్పటికే పలుమార్లు మళ్లీ లాక్ డౌన్‌ను విధించబోమని స్పష్టంగా చెప్పింది. మరోవైపు దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కేంద్రం మళ్లీ లాక్ డౌన్ ను విధించే సాహసం చేయబోదు. అలా చేస్తే సప్లయి, డిమాండ్‌కు మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అదే జరిగితే కోలుకునేందుకు ఇతర దేశాల కన్నా ఇంకా ఎక్కువ కాలమే పడుతుంది. కనుక లాక్ డౌన్‌ను మళ్లీ అమలు చేయరనే తెలుస్తుంది. కానీ రాష్ట్రాలకు మాత్రం లాక్డౌన్ తరహా నిబంధనలను అమలు చేసుకునే వెసులు బాటు కేంద్రం మరోసారి కల్పిస్తుందని తెలిసింది. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.