కేటీఆర్‌ను చూసి చంద్రబాబు తన కుమారుడికి కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆయన్ను ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే లోకేష్ కేటీఆర్ లా ప్రజ్ఞాశాలి కాదు. దీంతో జనాల నుంచి అతను విమర్శలను ఎదుర్కొన్నాడు.
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవునననే సమాధానం వినిపిస్తోంది. ఇక టీడీపీ పూర్తి బాధ్యతలను తన తనయుడు లోకేష్‌కే అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే పార్టీలో ముఖ్య నేతలు మాత్రం లోకేష్ ఆ పదవికి అనర్హుడని భావిస్తున్నారట.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే మొన్నీ మధ్యే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక త్వరలోనే టీడీపీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఓవైపు పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలతోపాటు మరోవైపు కొత్త నాయకత్వంపై కూడా టీడీపీ వర్గాల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది.
తెలంగాణలో గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవులు ఇచ్చారు. స్వతహాగానే కేటీఆర్ ప్రతిభావంతుడు కనుక ఆ పదవును సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే కేటీఆర్‌ను చూసి చంద్రబాబు తన కుమారుడికి కూడా అవే పదవులు ఇచ్చి ఆయన్ను ఎమ్మెల్సీగా కూడా చేశారు. అయితే లోకేష్ కేటీఆర్ లా ప్రజ్ఞాశాలి కాదు. దీంతో జనాల నుంచి అతను విమర్శలను ఎదుర్కొన్నాడు.
కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇచ్చారంటూ.. అప్పట్లో లోకేష్‌ను, చంద్రబాబును బాగా విమర్శించారు. ఇక అందుకు ఫలితం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనిపించింది. మంగళగిరిలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ వైసీసీ అభ్యర్థి ఆరే చేతిలో ఓడిపోయారు. దీంతో లోకేష్ పనితీరు, సామర్థ్యం, ప్రతిభా పాటవాలపై మరోసారి విమర్శలు చెలరేగాయి. అయితే కేవలం చంద్రబాబు తనయుడన్న ఏకైక అర్హతతోనే లోకేష్ ఇన్నాళ్లూ చినబాబుగా నెట్టుకొచ్చారు. అది కూడా మొన్నటి వరకు టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి లోకేష్ తెరపై కనిపించారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా మారింది లోకేష్ పరిస్థితి.
అయితే తాను ఉన్నప్పుడే లోకేష్‌కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే ఏవైనా పొరపాట్లు జరిగినా సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది కనుక.. చంద్రబాబు నేడో, రేపో లోకేష్‌కు టీడీపీ పూర్తి బాధ్యతలు అప్పగిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే చాలా మంది టీడీపీ నేతలు మాత్రం జూనియర్ ఎన్‌టీఆర్‌కు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ముందు ముందు టీడీపీ భవిష్యత్తు ఏమిటో.. లోకేష్ పరిస్థితి ఎలా మారుతుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!