మన దేశంలో విద్యావ్యవస్థ ఎంత దుర్భర స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ స్కూళ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ స్కూళ్లలో సదుపాయాల లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక ప్రైవేటు స్కూళ్లలో సదుపాయాలు ఉన్నప్పటికీ.. వారికీ లాభాపేక్ష ఉంటుంది కదా. కనుక వారు ఇరుకు గదుల్లో.. తరగతికి 60 నుంచి 100 మంది చొప్పున విద్యార్థులను కుక్కి మరీ పాఠాలు చెబుతుంటారు. అయితే ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్న స్కూళ్లలో సామాజిక దూరం సాధ్యమయ్యే పనేనా..? అని ఇప్పుడు మేథావులు అంటున్నారు.
కరోనా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశాక.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బహిరంగ ప్రదేశాలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ తిరుగుతారు. బార్లు, మాల్స్, మల్టీప్లెక్సులు, థియేటర్లు, ఆర్‌టీసీ బస్సులు.. ఇలా అన్ని చోట్ల మాస్కులను ధరించి, సోషల్ డిస్టాన్స్ పాటిస్తారు. బాగానే ఉంటుంది. కానీ ఇరుకుగా ఉండే స్కూళ్లలో ఇది ఎలా సాధ్యమవుతుందని.. నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తరగతి గదుల్లో లెక్కకు మించి విద్యార్థులను కుక్కి మరీ పాఠాలు చెప్పే స్కూళ్లు.. సామాజిక దూరంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయని.. మేథావులు అంటున్నారు.
అయితే ఇదే విషయంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. స్కూళ్లలో సరి, బేసి విధానంలో పాఠాలను బోధించేలా నూతన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అంటే ఉదాహరణకు 60 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ఒకే రోజు అందరికీ సామాజిక దూరం పాటిస్తూ పాఠాలు చెప్పడం సాధ్యం కాదు కనుక.. వారి రూల్ నంబర్ల ప్రకారం.. సరి సంఖ్యలో ఉన్నవారికి ఒక రోజు, బేసి సంఖ్యలో రూల్ నంబర్లు ఉన్నవారికి ఒక రోజు తరగతులు నిర్వహిస్తారన్నమాట. దీంతో నిత్యం ఒక తరగతికి 30 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఇలా సామాజిక దూరం పాటించడం సాధ్యమవుతుంది.
ఇక ఈ విషయం బాగానే ఉన్నప్పటికీ విద్యార్థులు మొత్తం పనిదినాల్లో సగం రోజులే స్కూల్‌కు వస్తారు కదా.. మరి వారి చదువులు ఏమవుతాయి..? అన్న సందేహం కూడా కలుగుతోంది. అయితే దీనికి కూడా సంబంధిత శాఖ అధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సామాజిక దూరం నిబంధన వల్ల ఇండ్లలో ఉండే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో, టీవీల్లో పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. స్టడీ మెటీరియల్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఇవ్వాలి. అయితే ఇలా చేయాలంటే పాఠశాలలన్నీ… స్మార్ట్ పాఠశాలలుగా మారాలి. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ను అమర్చుకోవాలి. అందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను తయారు చేయాలి. ఇది చాలా పెద్ద తతంగమే అవుతుంది. అందువల్ల ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే మేథావులు అంటున్నారు. మరలాంటప్పుడు విద్యార్థుల చదువులు దెబ్బ తినకుండా ఎలా చూడాలి..? అన్న విషయంపైనే ఇప్పుడు చర్చంతా నడుస్తోంది.
అయితే కరోనా లాక్‌డౌన్ ఎత్తేశాక స్కూళ్లను నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు వాటి నిర్వహణ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తాయో వేచి చూస్తే తెలుస్తుంది..!