దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎన్ని నిబంధనలను పాటిస్తున్నా.. లాక్డౌన్ అమలులో ఉన్నా.. నిత్యం కరోనా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. నిన్న మొన్నటి వరకు చాలా తక్కువగా ఉన్న కేసులు ఇప్పుడు 1 లక్షకు చేరువ కానున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోకపోగా.. లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తోంది. దీంతో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాన్ని గమనిస్తే.. అది కచ్చితంగా ప్రమాదకరమైందేమోనని అనిపిస్తోంది. వైరస్ సోకిన వాళ్లకు సోకుతుంది.. ఉన్న వాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారు.. అన్న ఉద్దేశ్యంతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో లాక్డౌన్ విధించలేదు. ఆర్థిక వ్యవస్థ పేరు చెప్పి కరోనా లాక్‌డౌన్‌ను అక్కడ అమలు చేయడం లేదు. కానీ కొన్నిరాష్ట్రాలు తమకు తాముగా నియంత్రణ విధించుకుని పలు రూల్స్‌ను అమలు చేస్తున్నాయి. అందుకనే అక్కడ విచ్చలవిడితనం పెరిగి ప్రజల్లో నిర్లక్ష్యం వచ్చింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో, రవాణా సదుపాయాల్లో వారు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నారు. అందుకనే అక్కడ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్ పరిస్థితి మాత్రం వేరు. కరోనాను కట్టడి చేసేందుకు మొదటి రెండు విడత లాక్డౌన్లను బాగానే అమలు చేశారు. కానీ 3వ విడత లాక్డౌన్లో మాత్రం ఆంక్షలను విశృంఖలంగా సడలిస్తున్నారు. మొన్న మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఇప్పుడు రైళ్లను అనుమతిస్తున్నారు. ఇక త్వరలో విమానాలను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే కరోనా కేసులు ఏమాత్రం తగ్గకుండా ఆకాశాన్నంటే విధంగా సంఖ్యలు దూసుకుపోతుంటే.. రోజుల వ్యవధిలోనే ఇన్ని లాక్డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇవ్వడం దేనికి సంకేతమో కేంద్రమే తేల్చాలి.
కరోనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రమాదకరమైన హెర్డ్ ఇమ్యూనిటీ సూత్రాన్ని అమలు చేస్తోంది. లాక్డౌన్ ఉండదు. ప్రజలు ఎక్కడికంటే అక్కడికి తిరుగుతారు. కరోనా సోకిన వారికి సోకుతుంది. ఉన్నవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. అప్పటి వరకు వైరస్ తీవ్రత తగ్గుతుంది.. ఇదీ.. హెర్డ్ ఇమ్యూనిటీ వెనుక ఉన్న అసలు విషయం.. అయితే భారత్ కూడా సరిగ్గా ఇదే ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తుందని.. మనకు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఓ వైపు సీఎం కేసీఆర్ డబ్బు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా బస్సులు, రైళ్లు, విమానాలకు అనుమతించడం వల్ల కరోనా తీవ్రరూపం దాలుస్తుందని కూడా తాజాగా సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోనట్లు అనిపిస్తోంది.
ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశంతో ఆంక్షలను ఎక్కువగా సడలిస్తే.. అది కరోనా వైరస్‌కు గేట్లు తెరిచినట్లే అవుతుంది. దీంతో ఇన్ని రోజుల పాటు మనం పడ్డ శ్రమ వృథా అవుతుంది. ఒక్కసారి గనక భారత్‌లో కరోనా తీవ్ర రూపం దాలిస్తే దాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. మరోవైపు అమెరికా వంటి దేశాల్లోనే భారీ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులకు చికిత్స అందించేందుకు సరైన సదుపాయాలు లేవు. ఇక ఈ విషయంలో భారత్ పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అలాంటప్పుడు కరోనా తగ్గకున్నా.. ఆంక్షలను సడలిస్తూ పోతే.. అది మనకు మనం చేసుకునే స్వయంకృతాపరాధమే అవుతుంది. ఇకనైనా కేంద్రం మేల్కొని ఇలాంటి విపరీత పోకడలకు వెళ్లకుండా.. భవిష్యత్ లో ఏర్పడే తీవ్ర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే.. కరోనా నుంచి మనవాళ్లను రక్షించుకున్నవారమవుతాం..!