ఎడిట్ నోట్: గడపగడపతో గట్టెక్కడం సాధ్యమేనా..!

-

గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజలకు అంతా మంచే చేస్తున్నాం..అందరికీ బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నాం..పంచాయితీలు, పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇలా అన్నిటిలో 90 శాతంపైనే గెలిచాం..కుప్పం లాంటి స్థానంలో కూడా సత్తా చాటమని, కాబట్టి 175కి 175 సీట్లు గెలవడం కష్టమేమీ కాదని, కానీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లంతా గడపగడపకు వెళ్ళి..మనం చేసిన కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు వివరించాలని చెప్పి జగన్ పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే.

అలాగే ఎమ్మెల్యేలు సరిగ్గా గడపగడపకు వెళ్లకపోతే వారికి క్లాస్ పీకుతున్నారు..అందరూ వెళ్లాలని..లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని అంటున్నారు. తాజాగా కూడా వర్క్ షాప్ నిర్వహించి..కొంతమందికి క్లాస్ ఇచ్చారు. 64 మంది గడపగడపకు సరిగ్గా వెళ్ళడం లేదని చెప్పి..అందులో కొందరి పేర్లు కూడా వినిపించారు.  అందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, చెల్లుబోయిన, జోగి రమేశ్‌, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు పేర్లు చెప్పగా, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాలినేని పేర్లు చెప్పారు.

అయితే ఎవరైనా సరే గడపగడపకు వెళ్ళాల్సిందే అని సూచించారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉండగానే ప్రతి 50 ఇళ్లకు గృహసారథులని నియమిస్తున్న విషయం తెలిసిందే. ముగ్గురిని నియమిస్తారు..వీరు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని చెప్పి..వైసీపీకి ఓటు వేసేలా పనిచేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యేల అయినా, ఎవరైనా ఇంటింటికి వెళ్ళి..తాము చేసింది చెప్పి..ప్రజల మద్ధతు వైసీపీకి ఉండేలా చూసుకోవాలి.

అంటే కేవలం గడపగడపకు వెళితేనే ఎన్నికల్లో గెలిచేయడం సాధ్యమవుతుందా..ఓ వైపు జగన్ బటన్ నొక్కి పథకాల పేరిట డబ్బులు పంచుతారు..ఎమ్మెల్యేలు, వైసీపీ శ్రేణులు వాటిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతారు. ఇంకా ఈ కార్యక్రమాలు సరిపోతాయా? అంటే చాలవనే చెప్పాలి. పథకాల పేరిట డబ్బులు పంచితే సరిపోదు..అభివృద్ధి కావాలి, రోడ్లు కావాలి, పన్నుల భారం తగ్గాలి..ప్రశ్నించివారి నోరు నొక్కడం తగ్గించాలి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలని సంతృప్తి పరచడం అంత ఈజీ అయిన పని కాదు.

పైగా గడపగడపకు వెళ్లని వారికి సీటు ఇవ్వకుండా ఉండటం కుదరదు. గడపగడపకు వెళ్లకపోతే వారు గెలవరని గాని, వెళ్ళిన వారు గెలుస్తారని లేదు. ఉదాహరణకు బొత్స, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కొడాలి లాంటి వారు గడపగడపకు వెళ్ళడంలో విఫలమవుతున్నారు..అంత మాత్రాన వారు ఓడిపోయే ఛాన్స్ లేదు. అలా అని గడపగడపకు వెళ్ళేవారు గెలిచేస్తారని లేదు. ఇక మొత్తం ఎమ్మెల్యేల బట్టే ఉండదు. సీఎం బట్టి కూడా ఉంటుంది. సీఎంపై కూడా వ్యతిరేకత వస్తే దాన్ని తగ్గించుకోవాలి. బటన్ నొక్కితే సరిపోదు. ఇలా చూసుకుంటే గడపగడపకు వెళితే గెలిచేస్తామని అనుకోవడం అనేది అవివేకమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version