ఎడిట్ నోట్: ఎన్టీఆర్‌@రాజకీయ నాయకుడు..!

-

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు గాని..ఆయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంటుంది. సినీ రంగంలో అగ్రహీరోగా ఉంటూ..మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇక మంచి వాక్చాతుర్యంతో..ఎంతటివారినైనా కట్టిపారేయగలా సామర్థ్యం ఎన్టీఆర్‌కు ఉంది. పైగా 2009 ఎన్నికల్లో టీడీపీకి ఎన్టీఆర్ ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసింది. పక్కా రాజకీయ నాయకుడు తరహాలో స్పీచ్‌లు ఇచ్చారు.

అందుకే ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కే దక్కుతాయని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కాకపోతే ఆయన ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో..ఇంకా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ తీసుకోవాలనే డిమాండ్ బాగా వచ్చింది. అయితే నిదానంగా చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. దీంతో కాస్త పరిస్తితి మారింది. అయినా ఇప్పటికీ టీడీపీలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది.

ఇదిలా ఉంటే రాజకీయ పరమైన అంశాల్లో ఎన్టీఆర్ చాలా తెలివిగా ముందుకెళుతున్నారు. పలు అంశాల్లో తన స్పందన చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇటు టీడీపీని సపోర్ట్ చేసినట్లు ఉండరు..అటు వైసీపీని విమర్శించినట్లు ఉండరు. అంటే కర్రా విరగకూడదు..పాము చావు కూడదు అనే టైప్‌లో..అప్పుడు భువనేశ్వరి విషయంలో అదే తరహాలో స్పందించారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పెట్టారు.

దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్న పేరుని జగన్ ప్రభుత్వం రాత్రికి రాత్రి తొలగించి వైఎస్సార్ పేరు పెట్టింది. దీనిపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అన్నీ విపక్షాలు పేరు మార్చడాన్ని తప్పుబడుతున్నారు. ఆఖరికి వైసీపీలో కూడా కొందరు నాయకులు పేరు మార్చడంపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి రామకృష్ణ, కల్యాణ్ రామ్‌లు సైతం పేరు మార్చడం బాధకలిగించిందని మాట్లాడారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం…ఎన్టీఆర్-వైఎస్సార్ విశేష ప్రజాధరణ కలిగిన నాయకులు అని, అలాగే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల..ఆయనపై గౌరవం పెరిగిపోదు అని, అలాగే ఎన్టీఆర్ గౌరవం తగ్గిపోదు అని..తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ముద్రని తొలగించలేరని చెప్పుకొచ్చారు. అంటే పేరు మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. కానీ పేరు మార్చడాన్ని మాత్రం తప్పుబట్టలేదు. దీనిపై తమ్ముళ్ళు ఫైర్ అయిపోతున్నారు.

అసలు ఎన్టీఆర్‌ని వైఎస్సార్‌తో కలిపి పొగడటం ఏంటి? ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ గొప్పోడు కాదు అని, అయినా ఎన్టీఆర్ తెలివిగా మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని, తమకు ఎన్టీఆర్ మద్ధతు ఏమి అక్కర్లేదు అంటూ తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో ఎన్టీఆర్ హుందాగా స్పందించారని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ స్టేట్‌మెంట్ చూస్తుంటే…చాలా డిప్లమాటిక్ గానే ఉంది. అంటే టీడీపీకి మద్ధతు ఇవ్వలేదు..అటు వైసీపీని విమర్శించలేదు.

అయితే కష్టాల్లో ఉన్న టీడీపీకి..ఇలాంటి అంశాల్లో మద్ధతు పలికి..జగన్ నిర్ణయాన్ని తప్పుబడితే ఆ పార్టీకి ప్లస్ అయ్యేది. కానీ ఎన్టీఆర్ అందరూ తమవాళ్లే అనే తీరులో రాజకీయం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే ఎన్టీఆర్ 2009లో వైఎస్సార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్-వైఎస్సార్ ఒకటే అన్నట్లు చెబుతున్నారు. అంటే ఎన్టీఆర్ కూడా పక్కా రాజకీయ నాయకుడు మాదిరిగానే మాట్లాడుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయమే వేరు అన్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version