మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన తనదైన శైలిలో యువ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు. ఇవే ఇప్పుడు చర్చకు తావిస్తూ ఉన్నాయి. జగన్ ను ఉద్దేశించి డెమొక్రటిక్ డిక్టేటర్ అని అన్నారు. ఈ విధంగా అనవచ్చా అన్నది ఓ సారి విశ్లేషిద్దాం నేటి ఎడిట్ నోట్ లో..
వాస్తవానికి ప్రజాస్వామ్య ధోరణుల్లో పాలకులే అంతిమ నిర్ణేతలు అయినా ప్రజలు అంతిమ నిర్ణేతలు అన్నది వాస్తవం. పాలకుల నిర్ణయాలు అధికారంలో ఉన్ననాళ్లూ చెలామణీ అయినా వాటిని మార్చుకునే తీరుబాటు కానీ వెసులుబాటు కానీ వాళ్లకు లేకపోయినా, ఐదేళ్ల తరువాత వారిని మార్చే అంటే శాసన కర్తలను, నిర్ణయాత్మక శక్తులుగా వ్యవహరించిన వారిని మార్చే హక్కు లేదా అధికారం ప్రజలకు ఉంది. కనుక ముందుగా యనమల లాంటి సీనియర్ లెజిస్లేటివ్ మెంబర్ నియంత అన్న పదం వాడడంపై వైసీపీ నుంచి తొలి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. తమ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ మాట అనడంపై వారి నుంచి తీవ్ర అభియోగాలతో కూడుకున్న వ్యాఖ్యలు కూడా వెల్లడి అవుతున్నాయి.
వాస్తవానికి ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాక కొన్ని ఏమరుపాటు లేదా నిర్లక్ష్య పూరిత ధోరణులు కూడా ఉండవచ్చు. గతంలో ఇవి అమలు అయినా తరువాత కాలం లో దిద్దుబాటుకు నోచుకున్నాయి. పాలన పరంగా ఉన్న తప్పులు గురించి మాట్లాడడంతోనే విపక్షం తొలి అడుగు వేయాలి. నిందా పూర్వక వైఖరి విడనాడాలి అని వైసీపీ హితవు చెబుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలను తాము నిరసించామని, వాటిని తప్పుబట్టామని అదేవిధంగా తమ తప్పులు గుణాత్మక రీతిలో విశ్లేషించాలని (క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలసిస్) వైసీపీ డిమాండ్ చేస్తోంది.
ఏదేమయినా తమ అధినేతను నియంత అని అనడం తప్పు అని ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబు హయాంలో ధిక్కారం వినిపించిన వారిని ఏ విధంగా ట్రీట్ చేశారో కూడా మీడియా ముఖంగా చెబుతామని, అందుకు కూడా సిద్ధంగా ఉండాలని వైసీపీ అంటోంది.
ఇక డెమొక్రటిక్ స్ట్రక్చర్ లో పాలకులు మారుతారు. రూలింగ్ సెక్టార్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలు కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగానో లేదా అతి చొరవ కారణంగానే కూడా తిలోదకాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో! వాటిపై కూడా ఎవరికి వారు విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పటికీ చాలా మంది టీడీపీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ తాము గతంలో చేసిన తప్పిదాల కారణంగానే ఓడిపోయాము అని అంటుంటారు.
అవును ! టీడీపీ కానీ వైసీపీ కానీ తప్పిదాలను దిద్దుకునే క్రమంలో ఉండాలన్నది ప్రజాస్వామిక వాదుల వాదన. ఇక డిక్టేటర్ అన్న పదం విషయమై కూడా యనమల కానీ టీడీపీ కానీ పునరాలోచన చేయాల్సి ఉంది అని వైసీపీ అంటోంది. తాము ఎన్నడూ ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు రుద్దడం లేదని , ఒకవేళ తప్పులు చెబితే దిద్దుకునేందుకు ఆస్కారం ఉంటుందని వైసీపీ తరఫున వాదన. నియంత అని పదంకు తమ వరకూ ఎటువంటి ఆస్కారం లేదు అని కూడా అంటున్నారు.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ గతంలో వ్యవహరించిన తీరు, నిర్ణయాలు అమలు చేసిన సందర్భాల్లో తాము కూడా ఆయను నియంతగానే భావించామని చంద్రబాబు ను ఉద్దేశించి వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా నిర్మాణాత్మక వైఖరితో ఇరు పార్టీలూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది అన్నది ఇవాళ ఆంధ్రుల ఆకాంక్షలు. పరస్పర దూషణ కారణంగా మంచి ఫలితాలు రావు అన్నది వారి అభిమతం. అభిప్రాయం కూడా!