ఘర్షణాత్మక వైఖరి నుంచి ఇరు వర్గాలూ తగ్గి, విరమించుకుని పరస్పర సామరస్య పూర్వక ధోరణికి రావాల్సిన సమయంలో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా కొన్ని చర్యలు కేంద్రం కానీ లేదా ఢిల్లీ అధికారులు కానీ చేపట్టడం నిజంగానే బాధాకరం అని అంటోంది కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధి వర్గం. నిన్నటి వేళ దేశ రాజధానిలో జహంగీర్ పురి అట్టుడికిపోయింది.
మూడు ప్రధాన పార్టీలు అక్కడికి చేరుకుని తమ వాదనను వినిపించినా కూడా ఫలితం లేకపోయింది. ఘర్షణలకు ఆనవాలుగా నిలిచిన ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ బుల్డోజర్ ఫార్ములాను అప్లై చేయడంతో రంగంలోకి సుప్రీం వచ్చింది. దీనిపై ఓ మత సంస్థ నమోదు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించి, కూల్చివేతలను ఆపాలని ఆదేశించింది. అయినా కూడా గంట సేపు
కూల్చివేతలు సాగాయి. ఆఖరికి మళ్లీ సుప్రీం చెప్పడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగ్గారు. కేంద్రం కానీ లేదా ఢిల్లీ అధికారులు కానీ చేపట్టిన చర్యలపై కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా గళం వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అమిత్ షా ఇల్లు కూల్చినప్పుడే దేశంలో అల్లర్లు ఆగుతాయి అని అటు ఆప్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఘర్షణాత్మక వైఖరిని నిలువరించే పద్ధతి ఇది కాదని, దోషులను కాదు అస్సలు సమస్యనే నిలువరించాల్సిన పద్ధతి కూడా ఇది కాదని హితవు చెబుతున్నాయి. కానీ బీజేపీ చేపట్టిన చర్యలను సోషల్ మీడియాలో కమల దళ నేతలు మద్దతుగా మాట్లాడుతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత అన్నది సమర్థనీయమే అని, దీన్నొక సాహసోపేత చర్యగానే భావిస్తున్నామని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 16న జరిగిన హనుమాన్ శోభా యాత్ర లో ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడులు తరువాత కాలంలో తీవ్ర పరిణామాలకు తావిచ్చాయి. వాటి ఫలితమే నిన్నటి కూల్చివేతలు.