ప్రజలకు సేవలందించాల్సిన.. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న.. ప్రభుత్వ ఉద్యోగులు వారు.. కానీ విధులు మరిచి.. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు..
ప్రజలకు సేవలందించాల్సిన.. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న.. ప్రభుత్వ ఉద్యోగులు వారు.. కానీ విధులు మరిచి.. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.. సోషల్ మీడియా పైత్యం వారిలో వెర్రితలలు వేస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి.. కాలక్షేపం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ కాలక్షేపపు పైత్యాన్ని వీడియోల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌లో ఉద్యోగులు, సిబ్బంది చేస్తున్న టిక్‌టాక్ వీడియోలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు..!
ప్రభుత్వ కార్యాలయాలా.. వినోదాల వేదికలా…
గత కొంత కాలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సమస్యలను పరిష్కరించమని వచ్చే ప్రజలు.. రోగాలను నయం చేయమని వచ్చే రోగులను పట్టించుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అందులోనూ.. టిక్‌టాక్ యాప్‌లో ఈ తరహా వీడియోలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. అనే సోయి లేకుండా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది రెచ్చిపోయి మరీ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేస్తున్నారు.
ఎందుకీ పైత్యం..?
సోషల్ మీడియాలో సహజంగానే ఎవరికైనా నలుగురితోనూ మెప్పు పొందాలని ఉంటుంది. అందుకనే ఇతరులచే తమ పోస్టులు, ఫొటోలు, వీడియోలకు లైకులు కొట్టించుకోవడం కోసం.. గతంలోనూ ఎంతో మంది చేయకూడని పనులు చేశారు. అయితే ఇప్పుడు టిక్‌టాక్ ప్రభావం ఎక్కువ కావడంతో.. అందరి దృష్టి అటు మారింది. ఈ క్రమంలోనే నలుగురిలోనూ పాపులర్ కావాలనే ఉద్దేశంతో.. వినోదంతో కాలక్షేపం చేయవచ్చనే కారణంతో చాలా మంది టిక్‌టాక్ లో డబ్‌స్మాష్‌లు చేస్తూ, పలు సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ.. వింతైన విన్యాసాలు, ప్రదర్శనలు ఇస్తూ.. అందులో వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
ఇంట్లో చేసుకోండి… బయట కాదు..
భారత రాజ్యంగం మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది. దాని ప్రకారం.. ఎవరు ఎలా అయినా ఉండవచ్చు. ఎలాగైనా జీవించవచ్చు. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. అయితే అలా అని చెప్పి.. బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి.. విధులను మరిచి.. ఇలా టిక్‌టాక్ వీడియోలు చేయడం ఎంతమాత్రం సరికాదు. అది అత్యంత ఆక్షేపణీయం.. వ్యక్తిగతంగా ఎవరు ఏం చేసినా.. ఏమీ కాదు.. వారిష్టం. అది వారి ఇంట్లోనే చేయాలి. లేదంటే వారికి చెందిన ఇతర నివాసాల్లో చేయాలి.. బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవాలి. అంతేకానీ.. విధులు నిర్వహించే చోట ఇలాంటి పైత్యానికి పాల్పడకూడదు. ఈ విషయం కూడా తెలియని కొందరు టిక్‌టాక్ పైత్యాన్ని నెత్తికెక్కించుకుని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ప్రభుత్వాలు గనక ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోకపోతే.. ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న విశ్వాసం పోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..!