అమరావతిని అస్థిరపరిచే మూడు రాజధానుల వాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, వైసీపీకి రాజకీయ ఆత్మహత్య కావడం తథ్యం. మూడు రాజధానుల వాదన న్యాయపరీక్షకు, రాజకీయ పరీక్షకూ నిలబడదు. జగన్ ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చే అవకాశమే లేదు.
అసలు రాజధాని: విశాఖ
అలంకార రాజధాని: అమరావతి
ఉత్తుత్తి రాజధాని: కర్నూలు
ఒకటి మాత్రం నిజం. జగన్మోహన్రెడ్డికి అమరావతిపై పగ ఉంది. రాజధాని ఎక్కడయినా పర్వాలేదు. అమరావతిలో మాత్రం వద్దు అన్నది ఆయన పంతంగా కనిపిస్తున్నది. జగన్ అమరావతికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వారిని కలుపుకోవడానికి రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టాడు. ఆంధ్ర, రాయలసీమ పంచాయతీ విశాఖకు వరమయింది. ఇది నిలబడుతుందా లేదా అన్న విషయం పక్కనబెడితే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును జగన్ శాశ్వతంగా నాశనం చేశారని మాత్రం రూఢి అవుతున్నది. ఇక ఏ పెట్టుబడిదారుడూ ఆంధ్రకు వచ్చే అవకాశాలు లేవు. ఇట్లా పగలు ప్రతీకారాలతో పరిపాలించే చోటుకు ఏ పరిశ్రమా రాదు. రాష్ట్రాన్ని శాశ్వతంగా ఒక అస్థిరత్వంలోకి నెట్టాడు జగన్.
ఆంధ్రకు శ్రీబాగ్ శాపం
అరవల నుంచి తెలుగు ప్రజలను విముక్తి చేసేందుకు ఆంధ్ర నాయకత్వం పోరాడుతున్న కాలంలో రాయలసీమ నేతలు కలసిరాలేదు. కరుడుగట్టిన ఆంధ్ర వ్యతిరేకి రాజాజీతో జరగుతున్న పెనుగులాటలో తమ బలం చాలక ఆంధ్ర నాయకత్వం ఆరోజు రాయలసీమ నాయకుల సాయం కోరింది. దాని పర్యవసానమే 1937లో జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక. రాయలసీమ నాయకత్వం అస్తమానం ఆ ఒడంబడికను గుర్తు చేస్తారు. దానిని అడ్డం పెట్టుకునే నీలం సంజీవరెడ్డి ఆంధ్ర నాయకులతో కబడ్డీ ఆడుకున్నాడు. ఉంటే కర్నూలు ఉండాలి, లేకపోతే విశాఖకు వెళ్లాలి అని ఆరో సంజీవరెడ్డి కూడా నాటకం ఆడారు. ముఖ్యమంత్రి పదవిపై టంగుటూరి ప్రకాశంకు ఉన్న ఆశను అడ్డంపెట్టుకుని, గౌతులచ్చన్న వంటివారిని కూడా మాయ చేసి అప్పట్లో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కాకుండా కుట్ర చేశారు. మద్రాసు అసెంబ్లీ తెలుగు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని కావాలని తీర్మానించినా ఆంధ్రేతర సభ్యులను సైంధవులుగా వాడుకుని అది అమలు కాకుండా చేశారు. అదే నాటకాన్ని ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకా మొరటుగా అమలు చేస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడికతో రాయలసీమకు ఒరిగిందేమీ లేదు. శ్రీబాగ్ను అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రులయిన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి…వీళ్లెవరూ రాయలసీమకు చేసిందేమీలేదు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి చేయబోయేదీ లేదు. రాయలసీమకు ఏదైనా ఎవరయినా చేశారంటే అది ఎన్టీఆర్, వైఎస్రాజశఖర్రెడ్డిలు మాత్రమే. మిగిలినదంతా కుట్రపూరిత రాజకీయమే. శ్రీబాగ్ ఆంధ్ర పాలిట శాపమయింది. ‘నిజానికి శ్రీబాగ్ను ఇప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకత్వం గుర్తించాల్సిన అవసరం ఏముంది? 2015లో అసెంబ్లీలో అమరావతికి మద్దతు పలికిన జగన్మోహన్రెడ్డి, ఐదేండ్లు తిరగకముందే మాటమార్చినపుడు ఎప్పుడో కుదిరిన శ్రీబాగ్ను ఆంధ్ర ప్రాంతం ఎందుకు గౌరవించాలి? శ్రీబాగ్ భారాన్ని ఆంధ్ర ఎందుకు మోయాలి?’ అని ఒక విద్యావేత్త ప్రశ్నించారు. ‘జగన్మోహన్రెడ్డి తనకు లభించిన అసాధారణ విజయంతో నిర్మాణం చేస్తారని ఆశించాము. కానీ ఆ విజయాన్ని ఆయన విధ్వంసానికి వాడుతున్నారు. ఎంత తప్పు చేశామే అని బాధపడుతున్నాము’ అని రాజమండ్రికి చెందిన జర్నలిస్టు ఒకరు అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు. రెండున్నర కోట్ల జనాభా, సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మధ్య ఆంధ్ర జిల్లాల ప్రజలకు రాజధాని తమ మధ్యే ఉండాలని కోరిక ఉండదా? ఒకనాడు కమ్యూనిస్టులను చూపి విజయవాడ-గుంటూరుల మధ్య రాజధాని ఉండాలన్న ఆకాంక్షను కొందరు రాజకీయ పెత్తందార్లు తూట్లు పొడిచారు. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని చూపి అదే పెత్తందార్ల వారసులు అమరావతిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి నుంచి నెల్లూరు జిల్లాల దాకా ఆ ఒక్క సామాజిక వర్గం ప్రజలే ఉన్నారా? ఇతర సామాజిక వర్గాల ప్రజలు లేరా? వారికి రాజధాని అక్కరలేదా? జగన్, ఆయన పరివారం చాలా సంకుచితంగా ఆలోచించి ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చి ఇప్పుడు పీకలలోతు ఊబిలో చిక్కుకున్నారు. ఇప్పటికయినా దిద్దుబాటు చేసుకోకపోతే జగన్ను మెజారిటీ ఆంధ్రప్రజలు ఎప్పటికీ క్షమించరు.
================
ఆంధ్రపత్రిక సంపాదకీయంలో కొంత భాగం…2 డిసెంబరు, 1953
పగ సాధింపే వారికి ప్రధానం
———————
రాజధాని వ్వవహారం
రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం మీదకంటే ఎక్కడ ఉండరాదు అనే విషయం మీద ఆంధ్ర ప్రభుత్వానికి కచ్చితమైన అభిప్రాయం ఉంది. విజయవాడ-గుంటూరు తప్ప మరెక్క రాజధాని ఏర్పాటైనా ప్రభుత్వానికి ఆక్షేపణ లేదు…తాత్కాలిక రాజధాని కర్నూలునుంచి కదలరాదనే పట్టుదలను కూడా ప్రభుత్వంవారు వదులుకోగలరు, వారికి కావలసింది విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క కార్యాలయము కూడా ఏర్పడరాదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎక్కడలేని ప్రేమాభిమానాలను కురిపించిన విశాఖపట్నాన్ని కూడా వదిలి వేశారు.
ఏమైతేనేం అత్యంత ప్రధానమైన రాష్ట్ర రాజధాని విషయంలో మన ప్రజాస్వామిక పక్షాలకు ఒక నిశ్చితమైన అభిప్రాయం లేదని మరొకసారి స్పష్టమైంది. ఈ ప్రజాస్వామిక పక్షాల ప్రముఖులు ప్రజాభిప్రాయాన్ని తమ ప్రకటనలలో, స్వకీయాభిప్రాయాలను తమ ప్రవర్తనలో ప్రతిబింబించుచు, రెండింటిని తమలో సమన్వయ పర్చుకున్నామని సంతృప్తితో వ్యవహరించుతూ ఉన్నతంతకాలం ఈ రాజధాని గతి ఇంతే.
ఈ పరిస్థితికి అన్ని పక్షాలవారూ బాధ్యత వహించవలసి ఉంటుంది. మంత్రివర్గంవారు తమలక్ష్యాన్ని సాధించుకోవడానికి అవలంభించిన మార్గాలు వారి ప్రతిష్ఠను ఈషణ్మాత్రము ఇనుమడింపజేయలేదు. ముఖ్యమంత్రి ప్రకాశంపంతులుగారు రాజధాని ఎక్కడున్నా ముఖ్యమంత్రి పదవి తనవద్ద ఉంటే చాలునన్న ధోరణితో వ్యవహరించారు. కనుకనే వారు మంత్రివర్గ విచ్ఛిత్తిని నివారించడానికి రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయడానికైనా వెనుదీయలేదు. ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు మంత్రివర్గంపోయినా, అసెంబ్లీ పోయినా, రాష్ట్రం ఏమైపోయినా తన మాట నెగ్గితే చాలునని కూర్చున్నారు. పగ సాధింపే వారికి ప్రధానమైనది….
================