తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పేదలు, దళితుల భూములను కబ్జాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఇక ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకముందే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలోనే బాగా ఆలోచించి ఈటల ఎట్టకేలకు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. నేడో, రేపో ఆయన స్పీకర్ను కలిసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నట్లు కూడా ఖరారు అయింది. అయితే ఈటల రాజేందర్ చేరికతో బీజేపీకి లాభం జరుగుతుందా ? లేక ఈటలకే ఆ చేరిక లాభం అవుతుందా ? అంటే.. దీనిపై విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎంత చేసినా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కనుక అందులో చేరితే కేసుల నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారు. అయితే ఈటలపై పెట్టిన కేసులు నిజమైనవైనా, అబద్దమైనవైనా.. బీజేపీలో చేరికతో ఆయనకు కేసుల పరంగా రక్షణ లభిస్తుంది. అందువల్ల ఈటలకు బీజేపీలో చేరిక లాభాన్నే కలిగిస్తుంది.
ఇక బీజేపీ పార్టీ పరంగా చూస్తే ఈటల బలమైన బీసీ నేత. తెరాసలో ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ నాయకుడిగా ఎదిగారు. ప్రజల మధ్య తిరిగే మనిషి అని పేరుంది. క్షేత్ర స్థాయిలో ఆయనకు బలమైన వర్గం ఉంది. రాష్ట్రంలోనూ ఈటల రాజేందర్ కు పెద్ద సంఖ్యలో అభిమానులే ఉన్నారు. ఉద్యమ నేతగా, ప్రజా సంఘాలు మెచ్చిన నాయకుడిగా ఆయనకు చాలా మంది మద్దతు ఉంది. అందువల్ల ఇది బీజేపీకి కలిసొస్తుందనే చెప్పవచ్చు. బీజేపీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే పట్టు బిగిస్తూ పార్టీని బలోపేతం చేస్తోంది. అటు దుబ్బాక, ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తాను చూశాం. ఈ క్రమంలో ఈటల చేరికతో పార్టీకి మరింత బలం వస్తుంది. ఈటల వెనుక ఉండే ఓటర్లంతా బీజేపీ వైపు మళ్లుతారు. ఇది బీజేపీకి కలసి వచ్చే అంశం. అందువల్ల ఈటల బీజేపీలో చేరిక ఆయనకే కాదు, ఇటు బీజేపీకి కూడా అవసరమే. ఇరువురికీ ఇది మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈటల రాజీనామా అనంతరం ఆయన స్థానానికి మళ్లీ ఎన్నిక జరుగుతంది. ఆ తరువాత రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు ఇప్పట్లో వచ్చేలా లేవు. మరి ఎన్నికలు జరిగే నాటికి బీజేపీ మరింత బలం పుంజుకుంటుందా, ఈటల చేరిక కలసివస్తుందా ? అప్పటికి పరిణామాలు ఎలా మారుతాయి ? అన్న విషయాలను ఇప్పుడే చెప్పలేం. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.