ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ వినిపించిన ప్రశ్నలకు ఈ రోజు ఆయన సమాధానం చెప్పారు. తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమే అన్నట్టు తెలుస్తోంది.
మరి ఆయన బీజేపీలో చేరితే ఎవరికి నష్టం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీలో దూసుకుపోతున్న బండి సంజయ్‌కు చెక్ పెట్టేందుకే ఈటలను తీసుకొస్తున్నట్టు చర్చ సాగుతోంది. కిషన్‌రెడ్డి ఎంతో కష్టపడి ఈటలను ఒప్పించి పార్టీలోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
బీసీల్లో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ రాకతో బీసీ ముద్ర వేసుకున్న బండి సంజయ్‌కు బ్రేకులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్‌కు కేవలం కరీంనగర్‌వరకు మాత్రమే పట్టు ఉంది. కానీ ఈటలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు, అభిమానులు, బలగం ఉంది. అలాంటి వ్యక్తితో బండికి చెక్ పెట్టేందుకు ఈటలను ఓ వర్గం సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది.