టీటీడీ చైర్మన్ పదవిని జగన్.. నటుడు మోహన్‌బాబుకే ఇచ్చేందుకు 100 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ క్యాబినెట్ లో ఎవరు మంత్రులు అవుతారోనని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్ రోజాకు హోం శాఖ అప్పగిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మంత్రి పదవుల మాట అటుంచితే నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం ఒకింత ఆసక్తికరమైన ప్రచారమే సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవిపైనే ఇప్పుడు చర్చంతా సాగుతోంది. ఆ పదవిని సినీ నటుడు మోహన్‌బాబుకు అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఈ విషయంపై జగన్ ఏమనుకుంటున్నారు ? అనే విషయం ఒకసారి పరిశీలిస్తే…
ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకమైన పోస్టు అయిన టీటీడీ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జగన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ప్రధానంగా రాజంపేట ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు ఈ పదవి కోసం ఆసక్తిని చూపిస్తున్నారట. అలాగే తిరుపతి వాస్తవ్యుడు, జగన్ కుటుంబానికి బంధువు అయిన సినీ నటుడు మోహన్ బాబు కూడా ఇదే పదవిని ఆశిస్తున్నారట. దీంతో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అయితే టీటీడీ చైర్మన్ పదవిని జగన్.. నటుడు మోహన్‌బాబుకే ఇచ్చేందుకు 100 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరి ఆయన కుమారుడు మంచు విష్ణుతో కలసి వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే తిరుపతి వాస్తవ్యుడు కావడం, అక్కడ మోహన్‌బాబుకు విద్యాసంస్థలు ఉండడం, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో జగన్.. మోహన్‌బాబు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఫిలింనగర్ దైవ సన్నిధానం ఆలయ చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నిజానికి ఈ ఆలయం విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో ఉంది. అయితే ఈ పీఠానికి చెందిన స్వరూపానంద స్వామి జగన్‌కు సలహాలు ఇస్తున్నందున ఆయన సూచిస్తే జగన్.. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే మరోవైపు మోహన్‌బాబు మాత్రం తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఇదే అంశాన్ని జర్నలిస్టులు ఆయన వద్ద ప్రస్తావించగా.. దాన్ని ఆయన ఖండించలేదు. దీంతో టీటీడీ చైర్మన్ పదవిని ఆయన ఆశిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి చివరకు మోహన్‌బాబుకు ఆ పదవి ఇస్తారా, లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది..!