ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి..ఇదే అధికార వైసీపీ కొత్త నినాదం..మొన్నటివరకు గడపగడపకు ఎమ్మెల్యేలు తిరిగారు. 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అంటూ కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు జగనే మళ్ళీ సిఎం కావాలని..అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని, పథకాలు పూర్తిగా అందుతాయని ప్రచారం చేయనున్నారు. సచివాలయ పరిధిలో పార్టీ కేడర్ మొత్తం ఇంటింటికి వెళ్ళి జనాన్ని కలిసి మాట్లాడతారు. ప్రతి పథకం ప్రజలకు వివరిస్తారు. మళ్ళీ జగన్‌ని సిఎం చేయాలని కోరతారు.
తాజాగా సిఎం జగన్..ఎమ్మెల్యేలకు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో వైసీపీకి పూర్తిగా అనుకూల పరిస్తితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక లెక్క..ఈ ఆరు నెలలు ఒక లెక్క..ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ పనిచేయాలని..175 సీట్లు గెలవడం అసాధ్యం కాదని చెప్పుకొచ్చారు. నవంబరుతో గడపగడప కార్యక్రమాన్ని ముగించనున్నారు. అటు స్థానికంగా నాయకుల మధ్య ఉండే విభేదాలకు స్వస్తి పలకాలని జగన్ చెప్పుకొచ్చారు. అయితే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాల్లో నేతలని సముదాయించి..అంతా కలిసికట్టుగా పనిచేసేలా సూచనలు చేస్తున్నారు. అందులో కొందరు గాడిలో పడుతున్నారు..గాని కొందరు గాడిలో పడటం లేదు. ఇంకా నేతలు విభేదాలు వీడకపోతే పార్టీకే నష్టం. అయితే జగన్ సైతం ప్రజల్లోకి రావలసిన అవసరం ఉన్నట్లు కనిపిస్తుంది. మామూలుగా ఏదొక కార్యక్రమం పేరుతో బహిరంగ సభ మాత్రమే పెడుతున్నారు.
కానీ రోడ్ షోలు నిర్వహించడం లేదు. అక్కడే సభలు పెట్టడం లేదు. అవి చేస్తేనే ఇంకా వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.