ప్రజాస్వామ్యంలో పనిచేసే ప్రభుత్వాలను నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీలు చేసే తప్పులను నిలదీయాలి. పాలకులను ప్రశ్నించాలి. సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ యాక్టివ్‌గా ఉండాలి. కానీ తెలంగాణలో చూస్తే మాత్రం అసలు ప్రతిపక్షం ఉందా, లేదా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అసలు ఏ అంశంపై పోరాటం చేయాలో తెలియక ప్రతిపక్ష పార్టీల నేతలు గప్‌చుప్‌గా ఉంటున్నారు తప్పితే.. ప్రజాక్షేత్రంలోకి వచ్చి సమస్యలపై పోరాటం చేస్తూ.. అధికార పార్టీని నిర్దాక్షిణ్యంగా నిలదీసే నేతలు ఒక్కరూ తెలంగాణలో కనిపించడం లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ అన్నా, సీఎం కేసీఆర్ అన్నా.. ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా సైలెంట్‌గా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయ్యే సమయంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉందని, అందులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, పాలకులను ప్రశ్నిస్తానని అన్నారు. కానీ సమాజంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినా.. ఇప్పటి వరకు వాటిపై పోరాటం చేయడంలో ఆయన ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. టీడీపీలో రేవంత్ రెడ్డి బలమైన నేతగా ఎదిగారు. అప్పట్లోనే ఆ పార్టీలో నంబర్ 2 స్థాయికి చేరుకున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆయన డీలా పడిపోయారు. ఈ పార్టీలోనూ రేవంత్ రెడ్డి నిజానికి బలమైన నేతగా ఎదగాల్సి ఉంది. ప్రజలను ఆకట్టుకుంటూ.. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన రేవంత్ ఆ పనిచేయడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారు.
నిజానికి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే.. ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేసే తప్పులను ప్రజలకు ఎత్తి చూపాలి. ఆ దిశగా పాలకులపై పోరాటం చేయాలి. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించాలి. ఏపీలో ఒక సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా అదే చేశారు. అదే ఆయన్ను తరువాత సీఎంను చేసింది. కానీ తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కాంగ్రెస్ మాత్రమే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా వెనుకబడ్డారు. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ కొన్నాళ్లుగా చప్పబడ్డారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఫెయిలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ అసలిప్పుడు ప్రజలకు సరిగ్గా కనిపించడమే మానేశారు.
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు శ్రద్ధ పెట్టాల్సి ఉంది. కానీ వారు దీని గురించి పెద్దగా ఆలోచించలేదు. భవిష్యత్తులో తమకు ఏర్పడే ఓటు బ్యాంకును విస్తృతం చేసుకునేందుకు వలస కార్మికుల సమస్య ఒక ప్రధానమైన అంశంగా ప్రతిపక్ష పార్టీలకు దోహదపడుతుంది. కానీ వారు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలే పేదలు, కూలీలకు సహాయం చేస్తూ కనిపిస్తున్నారు.. కానీ అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు ఆ పార్టీ ముఖ్య నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కార్మికులను ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అయితే రానున్న రోజుల్లోనైనా మేల్కొని ప్రజాక్షేత్రంలోకి రాకపోతే మాత్రం.. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు ఇంకా దూరం పెడుతారు. ఆ పరిస్థితి వస్తే ఆ పార్టీలకు ఇక ప్రజలను ఓట్లు అడిగేందుకు ముఖం కూడా చెల్లదు.