తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా హుజురాబాద్ చుట్టే నడుస్తోంది. త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది కనుక అధికార విపక్షాలు అన్నీ అక్కడే తిష్ట వేసి ఆ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ఆకాంక్షిస్తున్నాయి. ఇక అధికార పార్టీ తెరాస అక్కడ ఈటలను ఎదుర్కొనేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే దళిత బంధును అక్కడి నుంచే అమలు చేసి దళితులను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి తెరాసలో చేరిన వెంటనే ఆయనకు కీలక పదవిని అప్పగించడంపై సీనియర్ నాయకులు షాక్ తిన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి ఆడియో క్లిప్ వైరల్ అయ్యాక ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ లో తెరాస నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ఆడియో క్లిప్‌లో ఉంది. అయితే ఆ తతంగం ఏమోకానీ ఆయన తెరాసలో చేరాక సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. దీంతో అక్కడ కౌశిక్ రెడ్డి పోటీ చేయడం లేదని స్పష్టమైంది. అయితే కౌశిక్ రెడ్డి నిన్న గాక మొన్న పార్టీలో చేరితే ఆయనకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చి ఏకంగా ఒకేసారి ఎమ్మెల్సీని చేయడం ఏమిటని చాలా మంది తెరాస సీనియర్ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
హుజురాబాద్‌లో నిజానికి 2018లో అసెంబ్లీ ఎన్నికలలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు తెరాస నుంచి ఈటలో బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆ నియోజకవర్గంలో ఆయనకు ఉన్న కొద్ది బలాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకనే కౌశిక్ రెడ్డి పార్టీలో చేరీ చేరగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌లో తమకు కలసివచ్చే ఏ అంశాన్ని కూడా వదులుకోకూడదని, కౌశిక్ రెడ్డి ఈటల అంత బలమైన నేత కాకపోయినా ఆయనకూ బలం ఉంటుంది కనుక ఆ బలాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక్కటే సరైందని సీఎం కేసీఆర్ భావించి ఉండవచ్చు.
పైగా హుజురాబాద్‌లో ఈటల లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే ప్రతి అంశంపై దృష్టి సారించాలి. కలసి వచ్చే అన్ని అంశాలను వదులుకోకూడదు. అందుకనే సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి ప్రాధాన్యతను ఇచ్చారని, ఆయనకు పార్టీ చేరగానే ఎమ్మెల్సీని కూడా అందుకనే ఇచ్చారని తెలుస్తోంది. మరి హుజురాబాద్‌లో ఈటలపై తెరాస అభ్యర్థి గెలుస్తారా, లేదా.. అన్నది చూడాలి.