మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన పెద్ద ఉదంతం కౌశిక్ రెడ్డి బహిష్కరణ. ఆయన తనకు హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ దక్కిందని చెప్పిన ఆడియో కాల్ లీక్ కావడం పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గుడ్ బై చెప్పి… కారెక్కారు. ఈ నేపథ్యంలో నే ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవిని కూడా ఆఫర్ చేసింది.
కౌశిక్ రెడ్డి ఉదంతంపై కాంగ్రెస్ లో ఉండి వేరే పార్టీల కోసం పని చేస్తున్న వారిని వెతికే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ పలు వేదికలలో కూడా కోవర్టులుంటే బయటకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులది తలో దారి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ అంతు పట్టదు. అలా ఉంటుంది కాంగ్రెస్ నాయకుల తీరు. దీంతో ఆ పార్టీలో అనేక మంది నాయకులు గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉంటారు.
అయినా కూడా వారిని అధిష్టానం ఏమీ అనదనేది బహిరంగ సత్యం. కానీ ప్రస్తుతం ఇలా ఉన్న తీరును మార్చాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డికి ఇందుకోసం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్లే రేవంత్ పదే పదే కోవర్టుల గురించి వ్యాఖ్యలు చేస్తున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధాన నేతలందరూ రేవంత్ కన్నా సీనియర్లు కావడం గమనార్హం. వారు రేవంత్ మాట వింటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.