1992లో సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఆయన చనిపోయాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంకా అప్పటికి ధ్రువీకరించనందున ఆయనకు మరణానంతరం భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఒక వ్యక్తి కోర్టులో పిల్ వేశాడు.
భారతరత్న పురస్కారం అనగానే మనకు దేశంలోని పలు రంగాల్లో విశేషమైన సేవలు అందించిన ప్రముఖల పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఈ పురస్కారం చుట్టూ అనేక వివాదాలు కూడా గతంలో నెలకొన్నాయి. కొందరు కోర్టు దాకా వెళ్లారు కూడా. 1992లో సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఆయన చనిపోయాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంకా అప్పటికి ధ్రువీకరించనందున ఆయనకు మరణానంతరం భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఒక వ్యక్తి కోర్టులో పిల్ వేశాడు. దీంతో సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ప్రకటించి కూడా ఉపసంహరించుకున్నారు. ఇక ఆయన కుటుంబం కూడా ఆ అవార్డును స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఆ వివాదం అలా ముగిసింది.
1992లో భారతరత్న పురస్కారాన్ని బిరుదుగా ఎలా అభివర్ణిస్తారంటూ ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా కోర్టులలో ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్, కేరళ హైకోర్టులలో ఆ పిల్స్ దాఖలయ్యాయి. దీంతో అప్పట్లో సుప్రీం కోర్టు ఈ కేసులపై ఐదుగురు జడ్జిలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచిని ఏర్పాటు చేసి విచారణ చేయించి తీర్పు చెప్పింది. భారతరత్న పురస్కారాన్ని బిరుదుగా పరిగణించరాదని, అది కేవలం పురస్కారం మాత్రమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
2013లో సీఎన్ఆర్ రావు, సచిన్ టెండుల్కర్‌లకు భారతరత్న పురస్కారాలను ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై కూడా పిల్స్ వేశారు. సీఎన్ఆర్ రావు కన్నా హోమీ బాబా, విక్రం సారాభాయ్ వంటి సైంటిస్టులు ఎక్కువ సేవలను అందించారని, అలాంటప్పుడు వారికి కాదని రావుకు ఎలా భారతరత్న ఇస్తారని పిల్ వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయినందున టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వరాదని పిల్ వేశారు. అయితే ఆ పిల్స్‌ను కోర్టులు కొట్టి వేశాయి. దీంతో సీఎన్ఆర్ రావు, సచిన్ టెండుల్కర్‌లకు భారతరత్న పురస్కారాలను ప్రదానం చేశారు.
ఇక 1988లో సినీ నటుడు, అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్‌కు భారతరత్న ఇవ్వడం వివాదాస్పదమైంది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చారని విమర్శలు చేశారు. అలాగే రవిశంకర్ భారతరత్న కోసం పైరవీలు చేశాడని వార్తలు వచ్చాయి. 1977లోనూ కామరాజ్‌కు భారతరత్న ఇవ్వాలని ఇందిరా గాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికేననే విమర్శలు వచ్చాయి. ఇక దళితులను ప్రసన్నం చేసుకోవడానికే వీపీ సింగ్ అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చారని ప్రచారం సాగింది.
కాగా భారత స్వాతంత్ర్య సమరాని కంటే ముందు మరణించిన వారికి భారత పురస్కారాలను అందజేయడాన్ని పలువురు చరిత్రకారులు తప్పు పట్టారు. దీంతో మౌర్య చక్రవర్తి అశోకుడు, మొఘల్ చక్రవర్తి అక్బర్, మరాఠా వీరుడు శివాజీ, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, బాలగంగాధర తిలక్ వంటి అనేక మందికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు అప్పట్లో బాగా వినిపించాయి. అదేవిధంగా 2015లో మోదీ 1946లో మృతి చెందిన మదన్ మోహన్ మాలవ్యాకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించడాన్ని కూడా తప్పు పట్టారు. ఇలా భారతరత్న పురస్కారంపై ఎప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయినా.. దేశం ఒక పౌరుడికి భారతరత్న ఇచ్చిందంటే.. వారు ఏమీ సాధించకపోతే ఇవ్వరు కదా.. కనుక మన భారతరత్నలను మనం గౌరవించాల్సిందే..!