శ్రీకృష్ణుడు రాక్షసుడైన నరకాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు అతని చెరలో ఉన్న 16వేల మంది యువరాణులను అతను చూస్తాడు. వారంతా తమను కాపాడమని కృష్ణున్ని వేడుకుంటారు.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో కృష్ణావతారం కూడా ఒకటి. ఒక్కో అవతారం ద్వారా విష్ణువు రాక్షస సంహారం చేస్తాడు. అందుకనే ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ప్రతి సారీ ఏదో ఒక అవతారం దాల్చి అటు ప్రజలను కూడా రక్షిస్తూ వచ్చాడు. అయితే కృష్ణావతారంలో ఓవైపు ఆయన రాక్షస సంహారంతోపాటు పాండవులకు సలహాలిస్తూ వారు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేలా చేసి ధర్మాన్ని రక్షిస్తాడు. ఈ క్రమంలో కృష్ణుడి వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయనకు 16వేల మంది భార్యలు ఉంటారు. అయితే అంతమందిని ఆయన ఎలా చేసుకున్నాడా..? అని నిజంగానే చాలా మందికి సందేహం వస్తుంది. కానీ దాని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే…
శ్రీకృష్ణుడు రాక్షసుడైన నరకాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు అతని చెరలో ఉన్న 16వేల మంది యువరాణులను అతను చూస్తాడు. వారంతా తమను కాపాడమని కృష్ణున్ని వేడుకుంటారు. అయితే కృష్ణుడు తమను కాపాడే పక్షంలో తమను కృష్ణుడే పెళ్లి చేసుకోవాలని వారు షరతు విధిస్తారు. ఎందుకంటే ఎంతోకాలంగా నరకాసురుడి చెరలో ఉన్నందుకు తమను తమ భర్తలు మళ్లీ దగ్గరికి రానివ్వరని, అలాంటి స్థితిలో తమకు ఆత్మహత్యే శరణ్యమవుతుందని, కనుక తాము ఆ పనిచేయకుండా ఉండాలంటే.. నరకాసురున్ని వధించాక తమను కృష్ణుడే పెళ్లి చేసుకోవాలని వారు వేడుకుంటారు. అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు. ఆ తరువాత చెప్పినట్లుగానే కృష్ణుడు నరకాసుర వధ అనంతరం ఆ 16వేల మంది యువరాణులను భార్యలుగా స్వీకరిస్తాడు.
అయితే నిజానికి ఆ 16వేల మంది అంతకు ముందు జన్మలో రుషులట. వారు కృష్ణుడికి భార్యలుగా ఉండాలని కిందటి జన్మలో కోరుకుంటారట. ఆ మేరకు వారు కృష్ణున్ని ప్రార్థిస్తారట. దీంతో వారికి వరం ప్రసాదించిన కృష్ణుడు తరువాతి జన్మలో వారికి భర్తగా ఉంటాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే మరోవైపు.. ఎవరైనా ఒక యోధుడు ఎవరైనా ఒక స్త్రీని రక్షిస్తే ఆమెను అతను పెళ్లాడవచ్చని క్షత్రియ ధర్మం కూడా చెబుతుందట. అందుకనే కృష్ణుడు ఆ 16వేల మందిని రక్షించి వారిని వివాహమాడాడని కూడా కొందరు చెబుతారు.
ఇక కృష్ణుడు 16వేల మందిని పెళ్లి చేసుకున్నా.. ఏనాడూ ఎవరినీ కష్టపెట్టలేదట. అందరు భార్యలనూ సమానంగానే చూశాడట. అలాగే కృష్ణుడి భార్యలందరూ భర్త అడుగు జాడల్లో నడిచారట. కృష్ణుడు తన భార్యలందరికీ ఏ లోటు లేకుండా అన్యోన్యంగా కాపురం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అవీ… కృష్ణుడికి 16వేల మంది భార్యలు ఉండడానికి గల ముఖ్య కారణాలు..!