తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రైతు దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అన్ని క్లస్టర్ల పరిధిలోని కర్షకులతో సమావేశాలు నిర్వహిస్తారు. రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ ఛైర్మన్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల మండల స్థాయి అధికారులు ఆ సమావేశంలో పాల్గొంటారు.
తొమ్మిదేళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల విశిష్టతను తెలిపేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతోపాటు కరపత్రాలు పంపిణీ చేస్తారు. రైతులకు కలిగిన ప్రయోజనాలు, క్లస్టక్‌లోని గ్రామాలకు వ్యవసాయ శాఖ ద్వారా అందిన నిధుల గురించి ఈ సమావేశంలో వివరిస్తారు. రైతుబంధు, రైతు బీమా లబ్ధిదారులతో మాట్లాడించనున్నారు. సమావేశం అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్నదాతలతో కలిసి సామూహిక భోజనాలు చేస్తారు.
ఇవాళ సాయంత్రం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.