బంధాలు నమ్మకంతో ఏర్పడతాయి. ఆ నమ్మకం చెదిరిపోయినపుడు బంధానికి బీటలు వస్తాయి. అలాంటప్పుడు ఆ బంధంలో నుండి తొందరగా బయటపడాలి. లేదంటే అ బీటల్లో పడి నలిగిపోవాల్సి వస్తుంది. మీ బంధం విషపూరితం అని తెలిసే సంకేతాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఒకరొకరు సపోర్ట్ లేకపోవడం, ఒకరంటే మరొకరికి అసహ్యం, ఊరికూరికే కోపం తెచ్చుకోవడం లాంటి లక్షణాలు ఈ బంధంలో కనిపిస్తాయి. అలాంటి బంధంలో మీరున్నారని తెలుసుకోవడానికి పనికొచ్చే మీ మనోభావాలు..
ఉత్సాహం తగ్గిపోయి, శక్తి లాగేసుకున్నట్లుగా ఉండడం
జీవితం మీద ఉత్సాహం తగ్గి, మీలోని శక్తినంతా ఎవరో లాగేసుకున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటే గనక, అది మీ బంధంలో లోపం అయి ఉండవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటున్నప్పటికీ మనసు మీద పడే ప్రభావాలు శారీరకంగా ప్రభావితం చేస్తాయి.
భయం మిమ్మల్ని ప్రేరేపించడం
చాలా వరకు నిర్ణయాలన్నీ ఏమవుతుందో అన్న భయంలోనే తీసుకుంటారు. కొన్ని కొన్ని సార్లు కోపంతో ఊగిపోయి అనవసర నిర్ణయాలు తీసుకుని చతికిల పడుతుంటారు. ఈ ప్రవర్తనకి కారణం మీ బంధం విషపూరితమై ఉండి ఉండే అవకాశం ఉంది.
మీ భావాలు, అవసరాలు ఎవ్వరికీ అవసరం లేనివిగా అనిపిస్తుంది
మీ భాగస్వామి మిమ్మల్ని పెద్దగా పట్టించుకోనందున మీ గురించి ఎవరికీ అవసరం లేనట్టుగా మీ ప్రవర్తన ఉంటుంది. మీ సామర్థ్యాల మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. దానివల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. ఏ పని చేయాలన్నా ఎందుకు? నాకెవరున్నారు? దేనికోసం చేయాలన్న ఆలోచన వస్తుంది.
మీ భాగస్వామి బాధపడతారేమో అని పదే పదే ఆలోచిస్తారు
మిమ్మల్ని నియంత్రించే భాగస్వామి మీతో బంధంలో ఉన్నప్పుడు, అవతలి వారికి అప్సెట్ చేయకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. ప్రతీసారి వారికి నచ్చింది లేదా వారు చెప్పిందే చేస్తారు.
గౌరవం, మర్యాద ఇవ్వరు
చిన్న చిన్న విషయాల్లో కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోకుండా మీకు గౌరవం ఇవ్వరు. నలుగురు కలిసినపుడు మిమ్మల్ని పరిచయం చేయకుండా బాధపెడుతుంటారు. అది మీపై మరింత ప్రభావం చూపుతుంది.