వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల బంధాలు మీకు తారసపడతాయి. వాటిల్లో కొన్ని అద్భుతంగా ఉంటాయి. కొన్ని అతి కష్టంగానూ మనసును ఇబ్బంది పెట్టే విధంగానూ ఉంటాయి. ప్రతీ బంధం ఏదో ఒక పాఠాన్ని మనకు ఇచ్చి వెళ్తుంది. అయితే కొన్ని బంధాలు నేర్పిన పాఠాలను తొందరగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మళ్లీ మళ్లీ అదే రకమైన బంధాలు మన జీవితంలోకి వచ్చి జీవించడాన్ని కష్టతరం చేస్తుంటాయి.
ప్రస్తుతం మీ వయసు 30కి చేరుకోక ముందే బంధాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం.
సర్దుకుపోవడం:
నేను ఇలానే ఉంటాను అంటే నీ నుండి ఒక్కొక్కరుగా దూరం అవుతూనే ఉంటారు. అందుకే సర్దుకుపోవడం నేర్చుకోవాలి. సర్దుకుపోవడం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కాదు, నీతో రిలేషన్ షిప్ లో ఉన్న వారి అవసరాలను గుర్తించడమని తెలుసుకో.
నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది:
కొత్త వ్యక్తి పరిచయం అవ్వగానే వెంటనే వాళ్ళ మీద నమ్మకం వచ్చేయదు. బంధం స్టార్ట్ అయినప్పుడు అవతల వారి మీద నమ్మకం నెమ్మదిగా పెరుగుతుంది. నువ్వు కూడా తొందరగా పెరగాలని ఆవేశ పడకు.
సమయాన్ని గడపటం:
మీరు ఎవరితోనైతే రిలేషన్ షిప్ లో ఉంటున్నారో వాళ్లతో సమయాన్ని గడపాలి. ఇద్దరూ కలిసి చిన్న చిన్న పనులు చేయడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటివి చేస్తుండడం వలన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.
అర్థం చేసుకునే గుణం :
రిలేషన్ షిప్ లో ఇద్దరు ఉంటారు కాబట్టి అవతలి వాళ్ళ భావావేశాలను అర్థం చేసుకునే తత్వం ఉండాలి. వాళ్ల ఎమోషన్స్ ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే బంధం ఎక్కువ రోజులు కొనసాగదు.
బంధాన్ని వదులుకునే శక్తి :
కొన్ని బంధాలు మనసుకు ప్రశాంతతను ఇస్తే ఇంకొన్ని మాత్రం శాంతిని దూరం చేస్తాయి. అలాంటి బంధాల్లో నువ్వు ఇరుక్కుపోతే వీలైనంత తొందరగా బయటకు వచ్చేసేయ్. ఏ బంధం శాశ్వతం కాదని నువ్వు గుర్తుంచుకోవాలి.