జీవితంలో మనం ముందుకు వెళ్లడానికి పనిచేయడం ఎంతో అవసరం ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. కొంతమంది మన పనితో పాటు, అదనంగా కొంత పని చేయమని ఒత్తిడి తీసుకువస్తారు అయితే అలాంటి వాతావరణం లో మనం తీసుకోలేని అవసరం లేని అదనపు పనిని తిరస్కరించడం కొన్ని సార్లు సవాళ్లుగా ఉంటుంది. సమర్థవంతంగా, వినయంగా నో చెప్పడం వల్ల మీ సమయాన్ని మీ శక్తిని ఆదా చేసుకోవచ్చు. అవసరంలేని పనిని తిరస్కరించడానికి కొన్ని సరళమైన మార్గాలను మనము చర్చిద్దాం..
మీరు ఏ పనిని చేయాలి ఏ పని చేయకూడదు అనేది ముందుగానే నిర్ధారించుకోండి. మీ ప్రస్తుత లక్ష్యాలను బాధ్యతలను ముందుగా ఆలోచించండి. మీ సమయం, మీ శక్తి మీ పనికి మాత్రమే ఉపయోగించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ఇలా చేయడం వల్ల అదనపు పని మీ ప్రాధాన్యతను సరిపోతుందా లేదా అని నిర్ణయించుకోవడం సులభం అవుతుంది. ఉదాహరణకు ఆఫీసులో ఎవరైనా మీరు ఒప్పుకున్న ప్రాజెక్టు గురించి కాకుండా వేరే పని మీకు అప్ప చెప్పినప్పుడు. వెంటనే మీరు నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై దృష్టి పెట్టాను కాబట్టి అదనపు పని తీసుకోలేను అని మొహమాటం లేకుండా చెప్పేయండి.
తిరస్కరించేటప్పుడు సంకోచం లేదా ఇష్టం లేదు అని అవతల వారికి తెలియకుండా నిజాయితీగా వినయంగా ‘నో’ చెప్పడం, మీ ఉద్దేశం అవతలి వ్యక్తికి సరిగ్గా తెలియజేయాలి. ఉదాహరణకి ఎవరైనా మీకు పని చెప్పినప్పుడు,మీరు చెప్పిన దానికి చాలా థాంక్స్ కానీ ప్రస్తుతం నా పని ఎక్కువగా ఉంది నేను దీన్ని తీసుకోలేను అని చెప్పేయండి.
అవసరమైతే మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారో వారికి క్లుప్తంగా వివరించండి మీ నిర్ణయం వారికి ఒకసారి నచ్చొచ్చు. ఉదాహరణకి నా షెడ్యూల్ పూర్తిగా నాకు ఇచ్చిన ప్రాజెక్టు మీదే ఉంది. ఇప్పుడు వేరే పని ఒప్పుకుంటే దానిని పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వస్తుంది అని చెప్పండి.
పని తిరస్కరించడం వల్ల సంబంధాలు దెబ్బ తినకుండా ఉండేందుకు మీరు ఇంకో మార్గాన్ని ఆలోచించండి. ఎవరైనా మీకు పని చెప్పినప్పుడు నేను ఈ పని తీసుకోలేను నాకు ప్రస్తుతం టైం లేదు కానీ ఈ పని చేయగల వేరొక వ్యక్తిని మీకు చూపించగలను అని వారికి మీకు మధ్య ఉన్న రిలేషన్ దెబ్బతినకుండా సున్నితంగా చెప్పండి.
ఒకవేళ మీరు పని పూర్తిగా తిరస్కరించకూడదనుకుంటే, కొంత పనిని నేను పూర్తి చేస్తాను, మిగిలినది మీరు పూర్తి చేయండి అని అవతలి వ్యక్తిని ఒప్పించండి. తిరస్కరించడం అనేది మీ హక్కు అపరాధ భావన లేకుండా నమ్మకంగా,నువ్వు ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ సమయాన్ని మీ శక్తిని కాపాడుతుంది.