చలికాలం ప్రారంభం కాగానే వాతావరణంలో వచ్చే మార్పులు మన మానసిక ఆరోగ్యంపై, శారీరక కోరికలపై కూడా ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? చల్లని వాతావరణం వెచ్చని దుప్పట్లు, పొడవైన రాత్రులు.. ఈ సీజన్‌లో జంటల మధ్య సాన్నిహిత్యం లైంగిక కోరికలు పెరగడానికి దారితీస్తాయి. ఈ మార్పుల వెనుక కేవలం మానసిక కారణాలే కాకుండా కొన్ని బలమైన హార్మోన్ల ప్రభావాలు కూడా దాగి ఉన్నాయి. ఆ వెచ్చదనం వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం..
చలికాలంలో లైంగిక కోరికలు పెరగడానికి ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ స్థాయిలలో వచ్చే మార్పులు. పరిశోధనల ప్రకారం ముఖ్యంగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు శరదృతువు చివర్లో మరియు చలికాలం ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ హార్మోన్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ కోరికలను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అంతేకాక చలికాలంలో రోజులు చిన్నవిగా రాత్రులు పొడవుగా ఉంటాయి. దీనివల్ల మన శరీరంలో సెరటోనిన్ (Serotonin) అనే ‘సంతోషకరమైన’ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. సెరటోనిన్ స్థాయిలు తగ్గినప్పుడు కొంతమందిలో తాత్కాలికంగా మూడ్ స్వింగ్స్, ఉదాసీనత వంటివి కనిపిస్తాయి. దీనికి ప్రతిస్పందనగా, లైంగిక కార్యకలాపాల ద్వారా ఆనందం మరియు అనుబంధాన్ని పెంచే ఎండార్ఫిన్లు మరియు ఆక్సిటోసిన్ హార్మోన్లను శరీరం ఎక్కువగా కోరుకుంటుంది.

మరో ముఖ్యమైన అంశం మెలటోనిన్ (Melatonin) హార్మోన్. చీకటి పెరిగే కొద్దీ మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అయితే మెలటోనిన్ స్థాయిలు పెరగడం వల్ల, మన శరీరంలోని ఇతర లైంగిక హార్మోన్ల కార్యకలాపాలు కూడా పరోక్షంగా ప్రభావితం అవుతాయి.
చలికాలంలో ఇండోర్ వాతావరణం, ప్రైవసీ పెరగడం, మరియు ఇతరుల నుంచి వెచ్చదనం కోరుకోవడం అనే మానసిక అంశాలు కూడా హార్మోన్ల మార్పులకు తోడవుతాయి. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల, ఒకరి సాన్నిహిత్యం ఇంకొకరికి సౌకర్యాన్ని, భద్రతను అందించడమే కాకుండా శారీరక ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో కోరికలు పెరగడం అనేది హార్మోన్ల సమతుల్యతలో వచ్చిన సహజమైన మార్పుగా అర్థం చేసుకోవచ్చు.
