కరోనాకి మందు దొరికినప్పుడు కూడా ఆ జనాలకు ఇంత ఆనందం కలిగి ఉండేది కాదేమో! ప్రస్తుతం ఏపీలో మందు బాబుల సంబరాలు ఆ రేంజ్ లో అంబరాన్నంటుతున్నాయి. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో ఇన్నాళ్లూ గొంతు తడవక అల్లాడిపోతున్న మద్యం ప్రియులకు ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచే స్టాకు ఉంటాదో అయిపోతుందో అనే భయంతో మందు బాబులు క్యూలు కట్టేశారు. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే… ఏపీ తెలంగాణ బోర్డర్ లోని మందు షాపుల్లో పరిస్థితి మరింత రసవత్తరంగా ఉంది.
భద్రాచలం పట్టణానికి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం వద్ద తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు క్యూ కట్టారు. అదేముందిలే పెద్ద విషయం కాదు కదా అని అనుకునేరు… ఆ క్యూ పొడవు ఒక కిలో మీటరు పైనే! అవును… ఈ ఏపీ మద్యం కోసం తెలంగాణ మద్యం ప్రియులు ఏకంగా కిలోమీటరుకు పైగా ఓపికగా నిలబడి మద్యం బోటలు పడుతున్నారు!
కాగా… మందుపై 25 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో… మందుబాబులకు మందుకంటే మద్యం ధరలే కిక్కు ఇచ్చేలా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు దుకాణాల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం… మద్య నిషేధాన్ని అమలు చేసే క్రమంలోనే ధరలు పెంచినట్టు చెబుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు ఏపీలో మద్యం దుకాణాలు తెరుస్తారు!