కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమందికి ఉద్యోగాలు పోయాయి. కొన్ని కోట్లమంది ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు ఉన్న వారే ఆర్ధికంగా ఇబ్బందులు పడితే.. రోజు కూలీలు ఎన్ని కష్టాలు పడుతుంటారు.
ఈ కోవిడ్ 19 వల్ల ఆకలితో అలమటించే వారి సంఖ్య 8.3 కోట్ల నుండి 13 కోట్ల మందికిపైగా పెరిగే అవకాశం ఉందని ఆహార భద్రత, పోషణ పరిస్థితి- 2020 నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల మంది ఆకలితో అలమటించారని ఆ నివేదికలో ఉంది.
అయితే ఈ సంఖ్యను 2018తో పోలిస్తే ఒక కోటి ఎక్కువ అని.. గత ఐదేళ్లలో 6 కోట్లు ఎక్కువ అని అన్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కరోనా వైరస్ ఇలాగే కొనసాగితే.. 2030నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని చూడాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదని వారు తెలిపారు.
ఇప్పుడే, పరివర్తన ఏర్పడాలని.. కరోనాపై పోరాటానికి నిధులు కేటాయించాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ అన్నారు. ప్రపంచం కలిసికట్టుగా.. ఆకలి కేకలను దూరం చేయాలని గుటెరస్ పిలుపునిచ్చారు. నిజానికి ఈ కోవిడ్-19 కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు ఉన్నవారు కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు.