దేశంలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా ప్రభావం ఏమో గానీ రానున్న రోజుల్లో దేశంలో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోతారని తెలుస్తుండగా.. దాదాపుగా అన్ని రంగాలు తీవ్రమైన నష్టాల బాట పడతాయని ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వల్ల దేశంలో ఏయే రంగాలకు ఎంత నష్టం వాటిల్లుతుందో.. ఎంత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
* కరోనా వల్ల దేశ జీడీపీ వచ్చే ఏడాది 0.3 నుంచి 0.5 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
* కరోనా ప్రభావంతో భారతీయ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి రూ.620 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే హోటల్ రంగంలో సుమారుగా రూ.130 కోట్ల నుంచి రూ.155 కోట్ల వరకు నష్టాలు వస్తాయి. ఇక ఇదే రంగంలో ఇతర వ్యాపారులకు రూ.420 కోట్ల నుంచి రూ.470 కోట్ల వరకు నష్టం వస్తుందట.
* కరోనా వల్ల దేశంలో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో 12 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈ రంగాలకు రెండింటికీ కలిపి రూ.11వేల కోట్ల వరకు నష్టం వస్తుందట.
* కరోనా వల్ల విమానయాన రంగానికి ఏప్రిల్ – జూన్ నెలల మధ్య రూ.4200 కోట్ల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.
* కరోనా వల్ల దేశంలోని ఆహార రంగంలో 15 నుంచి 20 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని తెలుస్తోంది.
* దేశంలోని వాహన తయారీ కంపెనీలకు కేవలం మార్చిలోనే 2 బిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.
* కరోనా వల్ల దేశంలోని రిటెయిల్ రంగానికి చెందిన 1.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది.
* రియల్ ఎస్టేట్ రంగంలో 35 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారని సమాచారం.
* ఓలా, ఊబర్ తదితర కంపెనీలు 40 నుంచి 50 శాతం మేర నష్టాలు చవి చూస్తాయని తెలుస్తోంది.
అయితే పైన తెలిపినవన్నీ ఉజ్జాయింపు లెక్కలే అయినా.. ముందు ముందు పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పరిణామాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూస్తే తెలుస్తుంది.