దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ అనబడే కరోనా వ్యాక్సిన్‌కు ఇప్పటికే ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు వచ్చిన విషయం విదితమే. అయితే ట్రయల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ వరకు వ్యాక్సిన్‌ను ప్రజలు అందుబాటులోకి తెచ్చేలా చూడాలని ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్‌కు సూచించింది. కాగా దీనిపై విమర్శలు చెలరేగాయి. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌కే ఐదారు నెలల సమయం పడుతుందని.. అలాంటిది కేవలం 45 రోజుల్లోనే వ్యాక్సిన్‌ను ఎలా అందుబాటులోకి తెస్తారని నిపుణులు విమర్శించారు.
ఇక మరోవైపు భారత్ బయోటెక్ కూడా.. వ్యాక్సిన్ ఈ ఏడాది డిసెంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని గతంలో ప్రకటించింది. దీంతో అందరిలోనూ ఐసీఎంఆర్ ఆగస్టు 15 డెడ్‌లైన్ ప్రకటనపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చింది. ట్రయల్స్‌కు సమయం పట్టే విషయం వాస్తవమే అయినా.. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ట్రయల్స్‌కు గాను వాలంటీర్లను తీసుకోవడం దగ్గర్నుంచి, వ్యాక్సిన్‌ను పరీక్షించడం, దాని డేటాను రికార్డు చేయడం, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వంటి అంశాల వరకు.. జరిగే ప్రాసెస్‌లు అన్నింటినీ వేగవంతం చేయాలని తాము కోరామని.. అందుకే ఆగస్టు 15 డెడ్‌లైన్ విధించామని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నదే తమ తాపత్రయమని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే దీనిపై సైంటిస్టులు, వైద్య నిపుణులు ఏమంటారో చూడాలి.