కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4600 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఇక కేంద్ర బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) దేశంలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్ పాలసీ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై కరోనా వైరస్ ట్రీట్మెంట్కు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది.
కరోనా వైరస్ చికిత్సను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చాలని ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది. కరోనాతో రోగి హాస్పిటల్లో చేరితే అప్పటి నుంచి ట్రీట్మెంట్ ముగిసి డిశ్చార్జి అయ్యే వరకు ఇన్సూరెన్స్ ద్వారా ఖర్చులు భరించాలని ఐఆర్డీఏ తెలిపింది. కాగా ఈ నెల 4వ తేదీనే ఇందుకు గాను ఐఆర్డీఏ సర్క్యులర్ జారీ చేయగా, తాజాగా అందుకు సంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరే వారికి మెడిక్లెయిమ్ పాలసీ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బీమా కంపెనీలు వెంటనే స్పందించి వారి వైద్య ఖర్చులను భరించాలని ఐఆర్డీఏ తెలిపింది. ఇక కరోనా వైరస్ కేసులను వెంటనే తిరస్కరించరాదని, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఐఆర్డీఏ సూచించింది. ఇక కొత్తగా పాలసీలు రూపొందిస్తే వాటిలో కరనా చికిత్సను చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.