మొదటి వేవ్ తోనే కరోనా అంతం అయిపోయిందనుకుంటే సెకండ్ వేవ్ రూపంలో కరోనా పంజా గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్లు మొదలయ్యాయి. బయటకి వెళ్ళడాలు నిషేధించబడ్డాయి. దీనివల్ల ఇంట్లోనే ఉండడంతో ఫోన్లకి అతుక్కుపోతున్నారు. కరోనా గురించిన వార్తలు, విశేషాలన్నీ ఫోన్ ద్వారానే తెలుస్తున్నాయి. ఐతే ఇది ప్రస్తుతం ఓవర్ లోడ్ అయిపోతుంది. ఎక్కువ సమాచారం ఏదీ ఆలోచించనివ్వకుండా చేస్తుంది. దానివల్ల ఆందోళన మొదలవుతుంది. కరోనా వార్తల కలిగే ఆందోళనని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
అతి అప్రమత్తాన్ని దూరం పెట్టండి.
కరోనా గురించి జాగ్రత్తగా ఉండడం ఖచ్చితంగా కావాల్సింది. కానీ ప్రతీ దానికీ భయపడుతూ ఏదో జరుగుతుందన్న ఆందోళనని దూరం చేసుకోండి. దీనివల్ల మెదడు మీడ భారం పడి ఆలోచనని సక్రమంగా సాగనివ్వదు. ప్రతీసారి నెగెటివ్ వార్తల్లోనే ఉండకుండా మీకున్న అదృష్టాలని ఆలోచించండి.
క్షమించడం నేర్చుకోండి
మీరనుకున్నట్లు జరగనప్పుడు దాన్ని క్షమించేయండి. లేదంటే అది మీ భుజాలపై పెద్ద బరువుగా మారుతుంది. అందుకే వాటిని వదిలేసి మీకు నచ్చిన పని చేసుకుంటుంటే ఏ చింతా ఉండదు.
ఈ సామర్థ్యాన్ని నమ్మండి
క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటపడే మీ సామర్థ్యాన్ని నమ్మండి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీరు దాన్నుండి చాలా తొందరగా బయటపడగలరు. ఆ నమ్మకాన్ని మీలో పెంచుకోండి.
మీ భావాలని పంచుకోండి
మనసులో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు. మీకేవైనా సందేహాలు ఉన్నట్లయితే నిస్సంకోచంగా వాటిని ఇతరులతో పంచుకోండి. మీకు తెలియని సమాధానాలు అవతలి వారికి తెలిసే అవకాశం ఉంటుంది. అలా పంచుకోవడం వల్ల మీ మనసు తేలిక అవుతుంది.
అవతలి వారిపై నిందలు వేయవద్దు
మీరున్న పరిస్థితికి గానీ, అనుభవానికీ గానీ అవతలి వారిపై నిందలు వేయకండి. దానివల్ల ఏమీ రాదు. వదిలేయండి. మనసుని ఖాళీగా ఉంచుకోండి.
విపత్కర పరిస్థితులు మీ వరకు రానందుకు సంతోషించండి
ఇబ్బందులు మీ దాకా రానందుకు హ్యాపీగా ఉండండి. అది మీలో కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపి, మీకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.
కోవిడ్ వార్తలకు పూర్తిగా దూరం
సోషల్ మీడియాని కొన్ని రోజుల పాటు పూర్తిగా దూరం అవ్వండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు మీ చెవిన పడకుండా చూసుకోండి.