ఈ లాక్ డౌన్ వేళ జనాలను ఇళ్లలో ఉంచడం ప్రభుత్వాలకు తలకుమించిన భారం అవుతున్న సంగతి తెలిసిందే. పని ఉన్నా లేకున్నా బైక్ తీసి రోడ్లపైకి వచ్చే జనాలతో పోలీసులులకు కూడా తలకుమించిన భారంగా మారిన సంగతి తెలిసిందే. నోటితో చెప్తే వినరు.. లాఠీ తీస్తే ఏడుస్తారు అన్నట్లుంటుంది ఈ జనాల పరిస్థితి. ఈ సమయంలో ఇక ఇలాంటి పనులతో, పోలీసు దెబ్బలతో జనం మారరని భావించారో లేక.. జనాల నాడి పట్టేశారో కానీ… ఒక గొప్ప ఆలోచన చేశారు ఒక ఊరి పెద్దలు!
సుమారు 10 వేల కుటుంబాలు ఉన్న గ్రామం.. లాక్ డౌన్ అమలు చాలా కష్టంగా ఉన్న పరిస్థితి.. ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనం ఉండలేకపోతున్నారు.. సరిగ్గా అప్పుడే ఆ గ్రామ పంచాయతీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు! అనుకున్నదే తడువుగా అమలుచేశారు! ఇంతకూ ఆ గ్రామం ఎక్కడిది అంటారా? కేరళలోని మలప్పురం జిల్లాలోని తజిక్కోడ్ అనే గ్రామం కథే ఇది!
జనాలను లాక్ డౌన్ సమయంలో ఇళ్లల్లోనే ఉంచాలనే ఆలోచనకు మంచి పథకం రచించారు ఊరి పెద్దలు… ఇందులో భాగంగా లాక్ డౌన్ ముగిసేవరకు అంటే మే 3 వరకు ఒక్కరు కూడా ఇళ్లనుంచి బయటకు రాకపోతే అలాంటి వారికి బహుమతులు ఇస్తామని పంచాయతీ ప్రకటించింది. బహుమతులంటే అవేవో నామమాత్రపు బహుమతులు కావండి. విలువైనవే! మొదటి బహుమతి… అర సావరిన్ బంగారం, రెండో బహుమతి… రిఫ్రిజిరేటర్, మూడో బహుమతి.. వాషింగ్ మెషిన్. ఇవి కాకుండా మరో 50 కాంప్లిమెంటరీ బహుమతులు కూడా ఉన్నాయి.
లాక్ డౌన్ అధికారికంగా ముగిసిన వెంటనే ఈ బహుమతులు అందిస్తామని పంచాయతీ పెద్దలు వాగ్దానం చేశారు. మరి ఊళ్ళో ఉన్న పది వేల మందికీ బహుమతులు ఇవ్వలేరు కదా అనుకుంటున్నారా. అందుకనే ప్రజలందరికీ కూపన్లు ఇచ్చారు. లాక్ డౌన్ తరువాత లక్కీ డ్రా తీస్తారు. దాంట్లో అదృష్టవంతులకు బహుమతులు వస్తాయి. ఈ ఆలోచనేదో బాగానే ఉన్నట్లుంది కదా!!