ఐసోలేషన్ వార్డ్ చాలా బాగుంది; కరోనా బాధితుడు…!

-

ఐసోలేషన్ వార్డ్ ఏమీ చీకటి గదిలా ఉండదని చాలా బాగుందని కరోనా బాధితుడు ఒకరు మీడియాకు వివరించారు. కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతుంది. దీనితో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి గాను… ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని,

ఐసోలేషన్ వార్డుకి తరలిస్తారని చెప్పగానే చాలా మంది భయపడుతున్నారు. ఐసోలేషన్ పేరు వింటే చాలు చాలా మంది గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అది జైలు లా ఉంటుంది, ఒంటరిగా బతకాలని భయపడుతున్నారు. అలాంటి భయం అవసరం లేదని, ఐసోలేషన్ వార్డు చాలా బాగుంటుందని ఢిల్లీ కి చెందిన కోలుకున్న కరోనా బాధితుడు ఒకరు మీడియాకు వివరించారు. ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యాపారి 14 రోజుల పాటు ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ లో ఉన్నారు.

రెండు వారాలు ఐసోలేషన్ వార్డులో ఉన్నానని… అదేమీ జైల్లోని చీకటి గదిలా ఉండదన్నాడు. ఒంటరిగా ఉంటున్నాననే ఫీలింగ్‌ కలగలేదని, నాకు ఫోన్ ఇచ్చారని… వీడియో కాల్‌ చేసి ఇంట్లో వాళ్లతో మాట్లాడా అని పేర్కొన్నాడు. రోజూ రెండుసార్లు ప్రాణాయామం చేశానని, చాణక్యనీతి పుస్తకాన్ని చదివానని చెప్పుకొచ్చాడు. భజనలు చేశానని, ఇప్పుడు తనలో భక్తిభావం ఎక్కువైందని, డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, ఏ క్షణంలోనూ భయాందోళనకు తాను గురి కాలేదని తన అనుభవం అంతా వివరించాడు.

ఆశ్చర్యంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా హోలీ రోజు ఫోన్ చేశారని.. ఆ ఫోన్ కాల్ తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నాడు. కాగా, ప్రస్తుతం దేశంలో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version