కరోనా ఎఫెక్ట్ ఏపీలో మరింత పెరిగిందా? తొలిదశ, రెండో దశ దాటి ఇప్పుడు మూడో దశ దిశగా పరుగులు పె డుతోందా? అంటే.. ఔననే అంటున్నారు వైద్యులు. తాజాగా ఏపీలో నమోదైన కేసుల్లో మూడో దశ లక్ష ణాలు కనిపిస్తుండడంతో వైద్య వర్గాలు సహా ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ మూడో దశ అంటే ఏంటి? ఈ దశలో ఏం జరుగుతుంది? అసలు ఈదశ ఎలా వస్తుంది? అనే సందేహాలు అనేకం ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందు తొలి దశ గురించి తెలుసుకుందాం. తొలి దశ అంటే.. నేరుగా కరోనా వైరస్ వ్యక్తులకు సోకడం.
అంటే.. వైరస్ ఉన్న పదార్ధాలు తీసుకోవడం ద్వారా వైరస్‌ను అంటించుకోవడం. ఈ తొలిదశ చైనాలోనే పరిమితమైంది. అక్కడ వివిధ జంతువులను ఆహారంగా తీసుకునే అలవాటు ఎక్కువ గా ఉన్న నేపథ్యం లో ఆయా జంతువుల్లోని కొవిడ్-19 వైరస్ నేరుగా వ్యక్తులకు వచ్చింది. ఇక, రెండో దశలో ఇలా నేరుగా వైరస్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ ఉన్నవారికి వైరస్ వచ్చింది. నిజానికి వివిధ దేశాల్లో ఈ రెండో దశలోనే కేసులు భారీ ఎత్తున కనిపించాయి. మన దేశంలోనూ ఢిల్లీలోని మర్కజ్ ద్వారా రెండో దశవ్యాప్తి చెందిన ట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ దశలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను తెరమీదికి తెచ్చి పటిష్టంగానే అమలు చేస్తున్నాయి.
ఇక, మూడో దశ! ఇది అత్యంత ప్రమాదకరమైన దశగా వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ దశ వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి ప్రధాన కారణం తొలి రెండు దశలు కాకుండా.. మూడో దశ అంటే కరోనా ఉన్న ఆహారం తీసుకోకపోయినా.. కరోనా వైరస్ సోకిన వారితో ఎలాంటి సంబంధం లేకపోయినా.. కూడా వ్యక్తులకు కరోనా వస్తోంది. అదేసమయంలో ఇలాంటి వారిలో ఎలాంటి వైరస్ లక్షణాలు అంటే దగ్గు, ఆయాశం, గొంతు నొప్పి, మంట, తుమ్ములు, జ్వరం వంటి వి కనిపించడం లేదు కానీ పరీక్షలు చేస్తే.. మాత్రం కరోనా పాజిటివ్ వస్తోంది. మరి ఇలా ఎలా వస్తోంది? అనేది ప్రశ్న.
దీనికి వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. కరోనా విస్తృతంగా వ్యాపించిందని. గతంలో వచ్చిన నివేదికల ఆధారంగా కరోనా సోకిన వ్యక్తులు ముట్టుకున్న ప్రాంతాల్లో ప్రజలు పర్యటించడం, లేదా బహిరం గ ప్రాంతాల్లో పర్యటించడం, వారు ముట్టుకున్న వస్తువులను ముట్టుకోవడం ద్వారా కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇదే మూడోదశ. అంటే.. తరచుగా ఉదయాన్నే మార్కెట్‌కు వెళ్తున్నారు. తద్వారా మనకు తెలియకుండానే కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు పట్టుకున్న వాటినే పట్టుకోవడం, వారితో తెలియకుండా నే సంబంధం పెట్టుకోవడం వంటివి! ఈ దశలో ఎవరి నుంచి వైరస్ ఎవరికి సోకిందనే కారణాలు కూడా తెలియదు.
అదే సమయంలో విస్తృతి కూడా ఎక్కువ. సో.. మూడో దశ కారణంగానే అమెరికా, ఇటలీలు అతలాకుతలం అయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడు వందసార్లు.. నిజంగానే వందసార్లు ఆలోచించుకుని కాలుబయటకు పెట్టడం తప్ప.. చేయాల్సింది ఏమీలేదు!!