క‌రోనా నియంత్ర‌ణ‌కు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 అమ‌లు.. ఇంత‌కీ యాక్ట్ ఏం చెబుతోంది..?

-

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే దేశంలోని అనేక జిల్లాల్లో లాక్ డౌన్ ప్ర‌కటించింది. అయితే ప‌లు రాష్ట్రాలు త‌మ‌కు తామే స్వ‌చ్ఛందంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. అయితే కొన్ని చోట్ల కొంద‌రు క‌రోనా రోగులు, అనుమానితులు మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అలాంటి వారిపై ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే 123 ఏళ్ల కిందట రూపొందించిన ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివార‌ణ చ‌ట్టం)ను ప్ర‌భుత్వాలు ఇప్పుడు అమ‌లు చేస్తున్నాయి. అయితే అసలు ఈ యాక్ట్ ఏం చెబుతోంది..? దీంతో ప్ర‌భుత్వాలకు ఎలాంటి ప‌వ‌ర్స్ ఉంటాయి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

what is Epidemic Diseases Act 1897 and what it tells

1897లో అప్ప‌టి బ్రిటిష్ ప్ర‌భుత్వం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం.. ప్ర‌భుత్వాలు త‌మ‌కు ఉన్న ప‌వ‌ర్స్‌ను ఉప‌యోగించి కూడా అంటు వ్యాధుల‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోతే అప్పుడు ఈ యాక్ట్ ప్ర‌కారం.. ముందుకు సాగ‌వ‌చ్చు. దీంతో ప్ర‌భుత్వాలు వ్యాధి ఉన్నవారిని లేదా అనుమానితుల‌ను ఎవ‌ర్న‌యినా స‌రే.. నిర్భంధించి వారిని ప‌రిశీల‌నలో ఉంచ‌వ‌చ్చు. లేదా వారికి చికిత్స అందించ‌వ‌చ్చు. ఇక ఇందుకు తోడ్పాటునందించేవారిపై ఎలాంటి చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు ఉండ‌వు. కానీ ఇందుకు వ్య‌తిరేకించే వారిపై చ‌ట్ట‌ప‌రంగా కేసులు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకుంటారు.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సెక్ష‌న్ 2 ప్రకారం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ చ‌ట్టాన్ని ఉప‌యోగించి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కూ ఈ చ‌ట్టం వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న చ‌ట్టాల ద్వారా ఏవైనా వ్యాధుల‌ను అరిక‌ట్ట‌డం సాధ్యం కాక‌పోతే అప్పుడు ఈ చ‌ట్టం ప్ర‌కారం.. ఆ వ్యాధుల‌ను కంట్రోల్ చేసేందుకు ప్ర‌భుత్వాలు ముందుకు కొన‌సాగ‌వ‌చ్చు. అందుకు గాను ప్ర‌భుత్వాలు ఎలాంటి చ‌ర్య‌ల‌నైనా చేప‌ట్టేందుకు ఈ చ‌ట్టం అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాలు త‌మ రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను మూసివేయ‌వ‌చ్చు. అన్ని సంస్థ‌ల‌ను బంద్ చేయించ‌వ‌చ్చు. రోగుల‌ను హాస్పిట‌ల్‌లో లేదా ఇత‌ర ప్ర‌దేశాల్లో నిర్బంధంగా ఉంచేందుకు, వారికి చికిత్స అందించేందుకు ఈ చ‌ట్టం అవ‌కాశం క‌ల్పిస్తుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఏపీతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ను అమ‌లు చేస్తున్నారు.

ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైలు లేదా ఇత‌ర మార్గాల ద్వారా ప్ర‌యాణించే వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అధికారం ఉంటుంది. అలాగే వ్యాధి సోకిన రోగుల‌ను హాస్పిట‌ళ్ల‌లో విడిగా ఉంచ‌వ‌చ్చు. అనుమానితుల‌ను ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఒక చోట నిర్బంధించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వ అధికారులు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని ప‌రీక్ష‌లు చేయ‌వ‌చ్చు. రోగి అయితే చికిత్స అందించ‌వ‌చ్చు. ఇక ఈ చ‌ట్టం ప్ర‌కారం.. విదేశాల నుంచి వ‌చ్చేవారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అధికారం కేంద్ర ప్ర‌భుత్వానికి ఉంటుంది. వ్యాధి ల‌క్ష‌ణాలు, తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే వారిని నిర్బంధంలో ఉంచ‌వ‌చ్చు.

ఈ యాక్ట్‌ను ధిక్క‌రిస్తే ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 188 ప్ర‌కారం శిక్ష విధిస్తారు. ఎవ‌రికైనా హాని క‌లిగేలా ఎవ‌రైనా ప్ర‌వ‌ర్తిస్తే ఈ సెక్ష‌న్ ప్ర‌కారం 6 నెల‌ల వ‌ర‌కు జైలు శిక్ష లేదా రూ.1వేయి వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు. కాగా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897, సెక్షన్-2ని అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే భార‌త ప్ర‌భుత్వ కేబినెట్ కార్య‌ద‌ర్శి అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news