కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది… అగ్రరాజ్యం అమెరికా సైతం చలీ జ్వరం వచ్చిన పేషేంట్ లా వణికి పోయింది! ఈ క్రమంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శిస్తున్నారు వైకాపా నేతలు!! ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. కరోనా వైరస్ కట్టడి కోసం ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తూ.. అందులో భాగంగా ఎంత ఖర్చు అయినా ప్రజల ప్రాణాలే ముఖ్యం అని ఏకంగా దక్షిణ కొరియా నుంచి కరోనా కిట్స్ తెప్పించి టెస్టుల సంఖ్య పెంచుతూ.. వీలైనంత తొందరగా ఉన్న కేసులనన్నింటినీ గుర్తించి, చికిత్స అందించాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కృషిని ఏమాత్రం అర్ధం చేసుకున్నట్లు కనిపించని వైకాపా నేతలు… ఆ కృషిని బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు ప్రభుత్వానికి సహకరించకుండా, తగు సూచనలు చేయకుండా రాజకీయ విమర్శలు చేస్తూ కరోనా రాజకీయం చేయడం ఒకెత్తు అయితే… ప్రజలకు సాయం చేస్తూనే…భౌతిక దూరం అనే విషయం మరిచిన వైకాపా నేతలు దాదాపు అదేస్థాయి హాని తలపెడుతున్నారు! తాజాగా కరోనా సాయం పంపిణీ పేరిట వైసీపీ నాయకులు జాతర నిర్వహించడం పెద్ద దుమారమే రేపింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 30 ట్రాక్టర్ల నిత్యావసర సరుకుల లోడులతో, జనాలతో ర్యాలీ తీయడం కలకలం రేపింది. దీంతో బాధ్యతగా మెలగాల్సిన నేతలు కరోనాకు వాహకాలుగా మారుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే క్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే చేసిందీ ఇదేరకమైన పని కాగా… కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గంలోని 20 పంచాయతీల్లో సుమారు 11500 కుటుంబాలకు వైసీపీ నాయకులు వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూడా స్థానిక నేతలు, అధికారులు ఎలాంటి భౌతికదూరం పాటించకుండానే పాల్గొనడం విమర్శలకు కారణం అయ్యింది. ఇదే క్రమంలో అమలాపురం రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వైసీపీ నాయకు సాయం కోసం సామగ్రిని తీసుకురాగా అక్కడ జనాలు గుంపులుగా ఎగబడ్డారు.
ఇకపై అయినా ఇలాంటి పనులను మానుకోకపోతే… వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పనులు, పడుతున్న శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా వైకాపా నాయకులు వింటారాని ఆశిద్దాం!!