ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఎన్నో రకాల పనులు, ఉద్యోగాలు చేస్తుంటారు. వారంతా తాము చేసే పనులను బట్టి డబ్బు సంపాదిస్తుంటారు. కానీ కేవలం అమ్మ మాత్రమే వెలకట్టలేని సేవలు చేస్తుంది. అయినా మన నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించదు. నిజానికి అమ్మ చేసే సేవలకు వెలకట్టడం.. మనకే కాదు.. ఆ హరిహర బ్రహ్మాదులు వచ్చినా.. వారికి కూడా ఆ పని సాధ్యం కాదు. అంతటి అమూల్యమైన సేవలను అమ్మ మనకు అందిస్తుంది.
నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రించే వరకు అమ్మ ఇంట్లోని అందరి కోసం కష్టపడుతుంది. మనం వారంలో ఒక రోజు అయినా పనినుంచి సెలవు తీసుకుంటాం. కానీ అమ్మకు ఒక్కరోజు కూడా సెలవు ఉండదు. తనకు సుస్తీ చేసినా సరే.. మనకు మాత్రం అమ్మ తన సేవలను అందిస్తుంది. అందుకే అమ్మ చేసే సేవలకు మనం వెలకట్టలేం. అయితే గత కొంత కాలం కిందట అమెరికాలో ఓ అనలిటిక్స్ సంస్థ వారు అమ్మ చేసే సేవలకు ఉజ్జాయింపుగా లెక్క కట్టారు. దీంతో ఆ సేవలకు గాను నెలకు మనం రూ.70 లక్షల వరకు అమ్మకు చెల్లించాలి. అవును.. షాకింగ్‌గా ఉన్నా.. నిజంగా అమ్మ అంతకు మించి విలువైన సేవలనే మనకు అందిస్తుంది.
ఇక ఇంట్లోని కుటుంబ సభ్యుల బాగోగుల కోసం అమ్మ ప్రతి నిమిషం శ్రమిస్తుంది. తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తుంది. బిడ్డల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. బిడ్డల గెలుపులో తన గెలుపును చూసుకుంటుంది. అయినప్పటికీ సమాజంలో కొందరు మాత్రం తమ కన్నతల్లులను పట్టించుకోవడం లేదు. ఇది అత్యంత బాధాకరం.. మనల్ని నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసి.. మనల్ని ప్రయోజకులను చేసేందుకు తమ జీవితాలను త్యాగం చేసే మాతృమూర్తులకు నేడు సరైన గౌరవం దక్కడం లేదు. అది మనం చేసుకున్న దౌర్భాగ్యం.. ఇప్పటికైనా అమ్మ పట్ల అనేక మంది వైఖరిలో మార్పు రావాలని కోరుకుందాం.. అమ్మ చేస్తున్న వెలకట్టలేని సేవలకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేద్దాం..!!