బిడ్డలు కొందరు చిరిగిన చొక్కాలతో వచ్చారు. వానలు కొన్ని దంచి కొట్టి నిలువ నీడ లేకుండా చేశాయి కొందరిని. నగరం అన్నింటినీ తట్టుకుని ధైర్యాన్ని ఇచ్చింది. తల్లి కదా ! కష్టాన్ని కడుపున దాచుకుని మళ్లీ లేవండి మళ్లీ పరుగులు తీయండి మీరు ఓడిపోకండి అని చెప్పి వెళ్లింది. అటువంటి స్థితిలో కూడా శోకాన్ని జయించిన నగరం అంటే ఎందరికో ఇష్టం. ఎందరికో జీవనాధారం. ఈ చీకటిని ఈ కీడును మోసుకు వచ్చిన మనుషులను మనం ప్రశ్నించాలి. డబ్బు మాత్రమే మాట్లాడితే ఒప్పుకోకండి. అందుకు తగ్గ ప్రశ్నలు మీ దగ్గర ఉండాలి.. ఎదురు తిరిగే ప్రశ్నలు మీకు ఉంటేనే రాణిస్తారు. నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ హైద్రాబాద్ అని పిలిచేందుకు అంతా కలిసి గొంతు కలిపేందుకు ఓ ప్రయత్నం చేయగలుగుతారు. బిడ్డలకు బంగరు భవిష్యత్ ఇచ్చి పంపడంలోనే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రేమించండి చాలు. మీరు ఈ నగరాన్ని మీ ఇంటినీ ప్రేమించిన వారు అవుతారు.
చాలా రోజులకు కొన్ని విషాద ఉదయాలు పలకరింపుల్లో ఉన్నాయి. మీడియా రాస్తున్న వార్తలు నిజాలు అబద్ధాలు కలిసి ఉంటాయి కదా! ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. జీవితాల్లో మనం ఆనందించదగ్గ పరిణామాలు కొన్ని మాత్రమే ఉంటాయి. మోయాల్సినంత నింద, చేయాల్సిన తప్పు చేశాక పొందని పశ్చాత్తాపం ఇవన్నీ మనల్ని శాసిస్తాయి. ఆ విధంగా నగరం ఓ పెద్ద ముత్తైదువ అని అంటారే! ఆ తల్లి దగ్గర ఈ గర్భశోకం ఏంటని?
బిడ్డలు వచ్చి తల్లి కొంగు చాటున దాక్కొన్న తీరులా ఉంటుంది నగరం అని ఓ చోట అంటారో రచయిత. ఆహా ! ఎంత గొప్ప మాట ముద్దుల తడి ఆరని బిడ్డలను తన చెంత చేరిన బిడ్డలను పౌడరు రాసి పాపిడి దిద్ది సాకుతుంది నగరం అని అంటారు అదే రచయిత. ఎంత గొప్ప భావం. నగరం అంటే తల్లి కన్నా ఎక్కువ. తల్లి మందలింపు ఎంత బాగుంటుంది. తల్లి లాలింపు ఎంత లాలిత్యం అయి ఉంటుంది. అంతటి నగరంలో విషాదాలేంటి?