ప్రపంచంలోని మానవాళి మనుగడకు ఒక రకంగా చెప్పాలంటే విత్తనాలే కారణం. విత్తనాల నుంచి మొలకెత్తిన మొక్కలు, చెట్ల వల్లే మనకు కూరగాయలు, పండ్లు, బియ్యం లభిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటివరకు విత్తనాల జీవితకాలానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. దీంతో శాస్త్రవేత్తలు విత్తనాల జీవితకాలాన్ని తెలుసుకోవాలని తాజాగా పరిశోధనలు చేపట్టారు.
పలు జీన్ బ్యాంక్ లు విత్తనాల లైఫ్ టైమ్ తెలుసుకునేందుకు వందేండ్ల పరిశోధనలను మొదలుపెట్టాయి. ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు సంస్థలు భాగస్వామ్యం కానుండగా ఇందులో హైదరాబాద్ కు చెందిన ఇక్రిశాట్ జీన్‌బ్యాంకు కూడా ఉండటం గమనార్హం. శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ అధ్యయనం తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో ఆహార వనరులను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నార్వేలోని ‘స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్’లో ఈ పరిశోధనలో భాగంగా వేర్వేరు ఆహార పంటల విత్తనాలను భద్రపరచనున్నారు. 13 పంటల విత్తనాలను – 18 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర భద్రపరిచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాటిని పరీక్షిస్తారు. ఇలా వందేండ్ల పాటు పరిశోధనలు జరుగుతాయి. జర్మనీకి చెందిన జీన్‌బ్యాంక్ మొదటి విడతలో విత్తనాలను అందజేయనుండగా రాబోయే మూడు సంవత్సరాల్లో మిగిలిన జీన్ బ్యాంక్ లు విత్తనాలను అందజేస్తాయి. డాక్టర్ అస్ముండ్ అస్డాల్ ఈ పరిశోధనల సమాచారం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.