అవును.. ఎక్కడుందండి మానవత్వం. పేరుకే మనుషులం కానీ.. మానవత్వం లేని మనుషులం. రోజురోజుకూ మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవత్వం తగ్గిపోతోంది. అవినీతి, అక్రమాలు పెరగడంతో పాటు కులాలు, జాతులు, మతాలు.. అంటూ వాటిలోనే పడి కొట్టుకుంటున్నాడు మనిషి. దానికి నిలువెత్తు ఉదాహరణ ఈ ఘటన.
ఒడిశాలోని కర్పభల్ కు చెందిన 45 ఏళ్ల జానకి నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు సరోజ్. వయసు 17 ఏళ్లు. సరోజ్ చిన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. అకస్మాత్తుగా తల్లి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక.. సరోజ్ పక్కింటి వాళ్లను సాయం అడిగాడు. తల్లి అంత్యక్రియలకు సహకరించాలని వేడుకున్నాడు. కానీ.. సరోజ్ వాళ్లది తక్కువ కులం కావడంతో జానకి అంత్యక్రియలకు సహకరించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే.. వాళ్లు ఎక్కువ కులం వాళ్లు. ఎక్కువ కులం వాళ్లు తక్కువ కులం వాళ్లకు సహాయం చేయడమేంది. అది వాళ్లలో ఉన్న గజ్జి.
అంతే కాదు.. తన తల్లి అంత్యక్రియలను నిర్వహించడానికి స్మశానంలో ప్లేస్ కూడా ఇవ్వలేదు. దీంతో చేసేదేం లేక… కర్పభల్ లోని అడవిలో తన తల్లి అంత్యక్రియలను నిర్వహించడానికి తన సైకిల్ పై దాదాపు 5 కిలోమీటర్లు తన తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లాడు సరోజ్. అతడు తన తల్లి మృతదేహాన్ని సైకిల్ పై తీసుకెళ్తుండగా.. స్థానికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతే కాదు.. నెటిజన్లు.. అక్కడి స్థానికులపై మండిపడుతున్నారు. చావు దగ్గర కూడా కులాలు, మతాలు అంటూ కొట్టుకుంటున్నారా? ఛీ.. అసలు మీరు మనుషులేనా? అంటూ భగ్గుమంటున్నారు నెటిజన్లు.