మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క. అయితే తాను ఎంతో ఇష్టంతో రేండేళ్లుగా పెంచుకుంటున్నపెంపుడు కుక్కను వదిలి ఉండలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ శివార్లలోని పెరియానైకెన్పాలయం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి కవిత ఓ ప్రైవేటు కంపెనీలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తుండేది. కవిత ఓ కుక్కను తీసుకువచ్చి రెండేళ్లుగా దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటుండేది.
కుక్క మొరుగుతుండటం వల్ల తమకు నిద్ర పట్టడం లేదని, దాన్ని దూరంగా వదిలేయాలని ఇరుగుపొరుగు వారు కవిత తండ్రి పెరుమాళ్ చెప్పడంతో కవితను మందలించి పెంపుడు కుక్కను వదిలేయాలని ఆదేశించాడు. దీంతో ఆవేదన చెందిన కవిత తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రపంచంలో అందరూ శాంతియుతంగా జీవించాలని, తల్లిదండ్రులు, అమ్మమ్మ, సోదరుడు తన పెంపుడు కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ కవిత రాసిన సూసైడ్ నోట్ లో కోరింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులు ప్రతీవారం ఆలయాన్ని సందర్శించాలని కవిత లెటర్‌లో తెలిపింది.