ఒక మహిళను, మరో మగ వ్యక్తిని ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరిని తరలించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. తన భార్యను మరో వ్యక్తి ఉన్న స్ట్రెచర్‌పై పడుకోబెట్టొద్దని ఆ మహిళ భర్త డాక్టర్లను వేడుకున్నా వాళ్లు వినలేదు.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే కొందరు భయపడతారు. వ్యాధి నయం కాకున్నా ఏం లేదు కానీ.. మేం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లం.. ట్రీట్ మెంట్ చేయించుకోం.. అని డైరెక్ట్‌గా చెప్పేస్తారు. ఎందుకు అలా.. అంటే ప్రభుత్వ ఆసుపత్రులంటేనే నిర్లక్ష్యంతో ఉంటాయి. పోయి.. పోయి.. తమ ప్రాణాలను ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు అప్పగించాలా? అని భయపడుతుంటారు రోగులు.
అయితే.. పేదవాళ్లకు ఏదైనా వ్యాధి వస్తే.. వాళ్లకు మరో ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్లకు తప్పదు. కానీ.. ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం తమ నిర్లక్ష్య ధోరణిని మాత్రం ఇప్పటికీ మార్చుకోలేకపోతున్నాయనడానికి ఈ ఘటన మరో ఉదాహరణ.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న మహారాజా యశ్వంతరావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులను తరలించారు. అది కూడా ఒక మహిళను, మరో మగ వ్యక్తిని. ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరిని తరలించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. తన భార్యను మరో వ్యక్తి ఉన్న స్ట్రెచర్‌పై పడుకోబెట్టొద్దని ఆ మహిళ భర్త డాక్టర్లను వేడుకున్నా వాళ్లు వినలేదు. ఆసుపత్రిలో స్ట్రెచర్స్ లేవని.. మీకు ఇష్టం లేకపోతే వేరే ఆసుపత్రికి పోవాలని సిబ్బంది దబాయించారట.
కంద్వా జిల్లాకు చెందిన సంగీత అనే మహిళ తన కుడికాలికి గాయం కావడంతో ఆ ఆసుపత్రిలో చేరింది. కాలుకు ఎక్స్‌రే తీయడం కోసం తనను స్ట్రెచర్‌లో తరలిస్తూ.. ఆమె పక్కనే అదే స్ట్రెచర్‌లో మరో రోగిని కూడా పడుకోబెట్టారు. అయితే.. ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరిని పడుకోబెట్టగానే.. ఆసుపత్రిలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారట. బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటామని వాళ్లు చెప్పారు.