హనుమంత్ నాయక్, శివ కుమార్.. ఇద్దరు దాహంతో అలమటించి మృత్యువాత పడగా… ఎలాగోలా రోడ్డు దొరికించుకొని.. మూత్రం తాగి.. ప్రాణాలతో బయటపడ్డాడు కృష్ణ నాయక్.
ఆర్ నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమాలో అనుకుంటా.. అడవిలో నీళ్లు లేక ఎవరి మూత్రం వాళ్లు తాగుతారు. అది సినిమా. కానీ.. నిజంగానే ఓ వ్యక్తం తన మూత్రాన్నే తాగాల్సి వచ్చింది. లేకపోతే చచ్చిపోయేవాడు. దాహంతో చనిపోవడం కన్నా.. ప్రాణాలు దక్కించుకోవడం కోసం మేలు అనుకొని తన మూత్రాన్ని తానే తాగేశాడు.
ఆయనే కృష్ణా నాయక్. గుప్త నిధుల వేటకు వెళ్లిన సమయంలో.. అడవిలో తప్పిపోయి.. చివరకు నీళ్లు కూడా దొరకక.. అలమటించి.. ఓ బ్యాంక్ ఉద్యోగి, మరో వృద్ధుడు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి కదా. అదే వార్త మనం కూడా చదువుకునేది.
గుంటూరు జిల్లాకు చెందిన హనుమంత్ నాయక్, కృష్ణ నాయక్ తో పాటు హైదరాబాద్ కు చెందిన శివకుమార్ ప్రకాశం జిల్లాలోని వెలుగొండ అడవిలో గుప్త నిధుల వేట కోసం వెళ్లారు. వాళ్లలో హనుమంత్ నాయక్, శివ కుమార్.. ఇద్దరు దాహంతో అలమటించి మృత్యువాత పడగా… ఎలాగోలా రోడ్డు దొరికించుకొని.. మూత్రం తాగి.. ప్రాణాలతో బయటపడ్డాడు కృష్ణ నాయక్.
గత ఆదివారం వీళ్లు ముగ్గురూ అడవికి బయలు దేరారు. 15 మజ్జిక ప్యాకెట్లు, ఒక నీళ్ల సీసాను మాత్రమే వెంట తీసుకొని వెళ్లారు వీళ్లు. వెలుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న లోయను దాటుకుంటూ.. అడవి లోపలికి చాలా దూరం వెళ్లారు. అయితే.. మధ్యాహ్నం పూట కావడం.. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో వెంట తీసుకెళ్లిన మజ్జిగ, నీళ్లు అయిపోయాయి. అయినా గొంతు ఎండిపోయింది. దీంతో మరో అడుగు ముందుకు వేయలేకపోయారు. దీంతో ముగ్గురు వెనుదిరిగారు. చాలా దూరం నడిచి.. అడవిలో దారి తప్పి పోయారు. దీంతో తలో దిక్కుకు వెళ్లారు. అలా.. కృష్ణనాయక్ తన మూత్రాన్ని తానే తాగుతూ నడుచుకుంటూ రోడ్డు మీదికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలో ఉన్న గుడి పూజారి చూసి ముఖంపై నీళ్లు చల్లి కొంత ప్రసాదం ఇవ్వడంతో కృష్ణ నాయక్ బతికి బట్టకట్టాడు. అడవిలోనే తప్పిపోయి.. ఎటు వెళ్లాలో తెలియక.. నీళ్ల లేక దాహంతో అలమటించి.. అడవిలోనే చనిపోయారు మిగిలిన ఇద్దరు.