చంద్రగిరిలో ఇవాళ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను టీడీపీకి ఓటు వేసేలా ప్రభావితం చేసేందుకే రాజగోపాల్ అలా దొంగ సర్వే పేరుతో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అలాంటి దొంగ సర్వేలను నమ్మరని, కచ్చితంగా వారు వైకాపాకే ఓటు వేస్తారని పృథ్వీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలతోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 23వ తేదీన వెల్లడి కానున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు సంస్థలు చేపట్టిన అనేక సర్వేల్లో కేంద్రంలో హంగ్ వస్తుందని తేలగా, ఏపీలో వైకాపా అధికారంలోకి వస్తుందని తేలింది. అయినప్పటికీ ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మాత్రం ఏపీలో టీడీపీకే అధికారం వస్తుందని నిన్న ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం ఇవాళ సాయంత్రం వెల్లడిస్తానని కూడా చెప్పారు.
అయితే లగడపాటి రాజగోపాల్ ఇలా చెప్పడంపై ప్రముఖ సినీ నటుడు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పృథ్వీ స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఆడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. లగడపాటి ఇలా టీడీపీకి అధికారం వస్తుందని ఎందుకు చెప్పాడో పృథ్వీ తన ఆడియోలో వివరించారు. చంద్రగిరిలో ఇవాళ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను టీడీపీకి ఓటు వేసేలా ప్రభావితం చేసేందుకే రాజగోపాల్ అలా దొంగ సర్వే పేరుతో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అలాంటి దొంగ సర్వేలను నమ్మరని, కచ్చితంగా వారు వైకాపాకే ఓటు వేస్తారని పృథ్వీ అన్నారు.
అలాగే లగడపాటి, టీడీపీ నేతల అక్రమాలకు ఫుల్ స్టాప్ పడే రోజు అతి త్వరలోనే రాబోతుందని, ఈ నెల 23వ తేదీనే అందుకు ముహుర్తం కూడా కుదిరిందని పృథ్వీ అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓటర్లను ప్రభావితం చేయాలని చూడడం దారుణమైన చర్య అని అన్నారు. విజ్ఞత గల ప్రజలు దీన్ని గమనించారని పృథ్వీ అన్నారు. బూటకపు సర్వేల పేరు చెప్పి ఎవర్నీ భయపెట్టలేరని, ఎవరి భవితవ్యం ఏమిటో ఈ నెల 23వ తేదీనే తెలిసిపోతుందని ఆయన అన్నారు. అలాగే ఎవరు అధికారంలో ఉంటారో, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో కూడా అదే రోజు తెలుస్తుందని, అంత వరకు ఓపిక పడితే మంచిదని పృథ్వీ అన్నారు..!