బుల్లెట్‌ను దేవుడుగా కొలవడం ఏంటి ? అన్న ప్రశ్న రాక మానదు. కానీ ఇది నిజం. సాధారణంగా మనం గుడికి వెళితే దేవుడి దర్శనం చేసుకొని మొక్కు బడులు తీర్చుకుంటాం. కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం బైక్ ని దేవుడిలా కొలుస్తూ దానికే పూజలు చేస్తున్నారు. రాజస్థాన్ లోని జోథ్‌పుర్ కు దగ్గరగా ఈ బులెట్ దేవాలయం ఉంది. దీనిని ఓం బన్నా దేవాలయం అని కూడా అంటారు. బస్సు ప్రయాణికులు, మోటర్ సైకిళ్ల మీద వెళ్లేవారు, ట్యాక్సీవాలాలు, లారీ డ్రైవర్లు- ఇలా ఒకరేంటి, ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ ఆలయం దగ్గర ఆగి తీరుతారు.
ఈ గుడిలో దేవుడికి బదులు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది. ఇంకా బుల్లెట్ బాబా కి నైవేద్యంగా లిక్కర్ పెట్టడం విశేషం. మరి దీని వెనక కథేంటంటే.. గతంలో ఒకసారి ఓ యువకుడు బులెట్ పై వెలుతూ ప్రమాదంలో మరణించాడు. సదరు వాహనానాన్ని పోలీసులు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కానీ తెల్లవారేసరికి ఆ బండి తిరిగి ప్రమాదం జరిగిన చోటుకే చేరుకుంది. ఎవరో ఆకతాయి కావాలని ఇలా స్టేషన్ నుంచి బండి తీసుకువచ్చాడని అనుకున్నారు పోలీసులు.
ఈసారి బండిలో పెట్రోలు తీసేసి, తాళాలు బిగించి, గొలుసులు కట్టి మరీ స్టేషనులో ఉంచారు. కానీ ఆశ్చర్యం! మళ్లీ బండి ప్రమాదస్థలానికి తిరగివచ్చింది. ఇలా ఎన్నిసార్లు చేసినా తెల్లవారేసరికి బండి ప్రమాద స్థలానికే చేరుకునేది. దీంతో ఆ వాహనంలో సదరు యువకుడి ఆత్మ ఉందని గ్రామస్తులు భావిస్తారు. అటుపై ఆ వాహనానికి ఒక గుడి కట్టి పూజలు చేస్తున్నారు. కాగా, ఎవరైనా ఈ దారి గుండా వెళ్లాల్సి వస్తే తప్పక ఆ వాహనానికి నమస్కరించి వెలుతుంటారు. లేదంటే తమ ప్రయాణం సరిగా సాగదని వారు నమ్ముతుంటారు. ఈ బుల్లెట్ బాబాని పూజించడం వల్ల రోడ్ అసిడెంట్స్ లేదా ఇతర ప్రమాదాల నుండి ఆ బాబా వారిని కాపాడుతాడని స్థానిక భక్తుల నమ్మకం.