దెయ్యాల గురించి మాట్లాడుకోవడం అంటే మనకు భలే ఇంట్రస్ట్ ఉంటుంది, హర్రర్ మూవీస్ అంటే భయం ఉన్నా సరే అవే ఇంట్రస్ట్‌గా చూస్తాం. అయితే మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి, ఏంటంటే.. ఆ దేశంలో దెయ్యాల కోసం స్పెషల్‌గా ఒక గడియారం ఉంది. అంటే టైమ్ పెట్టుకోని మరీ దెయ్యాలు వస్తాయా..? విదేశీ విహార యాత్రలు చేసే వారెవరైనా ఒక సారి మాల్టా (Malta) వెళితే తికమక పడిపోతారు. ఎందుకంటే అక్కడున్న ప్రతి చర్చిపై (Church) రెండు గడియారాలు కన్పిస్తుంటాయి. వాటిలో వేర్వేరు సమయాలుంటాయి. అందుకే ఒకటి మనుషుల కోసం, రెండోది దెయ్యాల కోసం అట. అసలు ఏంటీ స్టోరీ ఒ లుక్కేయండి..!
రెండు గడియారాలు ఎందుకు పెడుతున్నారనే విషయంపై భిన్న వాదనలున్నాయి. ఏది సరైన వాదన అనే విషయంపై చరిత్రకారులు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ బాగా వినిపించే వాదన ఏంటంటే దయ్యాలను తికమక పెట్టాలని రెండు గడియారాలు పెట్టారట. చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నప్పుడు దయ్యాలు వస్తే తొందరగా వచ్చామేమో? ఆలస్యంగా వచ్చామేమో? అని అవి తికమక పడేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు కొందరు చెబుతున్నారు. రెండు గడియారాలు వేర్వేరు సమయాలు చూపిస్తున్నా విశ్వాసులు వాటితో సంబంధం లేకుండా చర్చి గంటలు మోగే శబ్దాన్ని బట్టి ప్రార్థనలకు వెళ్తుంటారు.
మరో ప్రచారం ఏంటంటే.. రెండు గడియారాలను సమాజంలో వివిధ రకాల వ్యక్తుల కోసం ఏర్పాటు చేశారట. ఒక గడియారం రైతులకు ఉపయోగపడుతుంది. అంటే వారు తొందరగా లేచి పొలం పనులకు వెళ్లడానికి సహాయ పడుతుంది. మరోది జాలర్ల కోసం. వీరు సమయాన్ని బట్టి కాకుండా అలల తాకిడి, రుతువుల ఆధారంగా వేటకు వెళ్తుంటారు. దాంతో రెండో గడియారంలో సమయం తప్పుగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకో ప్రచారంలో ఒక గడియారం స్థానిక సమయాన్ని, మరో గడియారం రోమ్ సమయాన్ని చూపిస్తుందని అంటారు. రెండు గడియారాలుంటే ఒకటి పని చేయకపోయినా మరొక దాని ద్వారా అసలు సమయం తెలుసుకోవచ్చనే ఆలోచనతో అలా పెట్టి ఉంటారని ఇంకొందరు అంటారు.
ఇది అసలు ఇంట్రస్టింగ్ మ్యాటర్..
రెండు గడియారాలను దుష్ట ఆత్మలను పారద్రోలడానికి పెట్టారని స్థానిక జానపద సాహిత్యం చెబుతోంది. 18వ శతాబ్దంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పట్లో మాల్టా గ్రామాన్ని దురదృష్టాలు వెంటాడేవట, పంటలు పండకపోవడం, అంటు వ్యాధులు ప్రబలడం, ఆకస్మిక మరణాలు సంభవించేవి. దాంతో తమ గ్రామం శాపానికి గురైందని, పీడ పట్టిందని స్థానికులు బలంగా నమ్మారు. ఏం చేయాలో పాలుపోక చివరికి గ్రామ మతాధికారిని సంప్రదించారు.
ఆయన సలహా మేరకు గ్రామ కూడలిలో రెండు గడియారాలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సరైన సమయాన్ని సూచిస్తే.. మరోకటి ఐదు నిమిషాలు ముందుండేది. ఈ సమయ వ్యత్యాసం దుష్ట శక్తులను గందరగోళానికి గురి చేస్తుందని ఆయన నమ్మాడు. దాంతో అవి గ్రామం విడిచిపోతాయని భావించాడు. ఊహించినట్లుగానే కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మార్పు కనిపించింది. పంటలు సమృద్ధిగా పండాయి. వ్యాధులు, బాధలు దూరమయ్యాయి.
అప్పటి నుంచి మాల్టాకు రెండు గడియారాల గ్రామం అనే పేరు వచ్చింది. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి చర్చి వద్ద రెండు గడియారాలను ఏర్పాటు చేశారు. కుడి వైపు అసలు సమయం, ఎడమ వైపు తప్పు సమయం పెడుతున్నారు. దాంతో మాల్టా గడియారాల కథ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇలాంటి ఇంట్రస్టింగ్ స్టోరీస్ మీ దగ్గరు కూడా ఏమైనా ఉన్నాయా..?