గోధుమ పిండితో బిడ్డ‌… డ‌బ్బు కోసం మ‌హిళ ఎంత మోసమో

ప్ర‌స్తుత స‌మాజంలో అనేక ర‌కాలుగా మోసాలు చేస్తున్నారు. కొంద‌రు ప‌క్కా ప్లానింగ్‌తో చేస్తుంటే.. మ‌రికొంద‌రు అతి తెలివి చూపించి బొక్క‌బోర్ల ప‌డుతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో జ‌రిగిన ఓ విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌ నమ్మశక్యం కాని వింత‌గా మారింది. డ‌బ్బుల కోసం ఓ మహిళ అతితెలివి ప్రదర్శించింది. గోధుమ పిండిని ముద్ద చేసి అప్పుడే పుట్టిన బిడ్డలా నమ్మించి అధికారులను మోసగించడానికి ప్రయత్నించింది. చివ‌ర‌కు ప్లాన్ బెడిసి కొట్టింది.


మధ్యప్రదేశ్‌లోని మొరీనా జిల్లా కైలరాస్‌కు చెందిన ఓ మహిళ `ఉదయ్‌ శ్రామిక్‌ సేవా సహాయత యోజన` క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16,000 ఇస్తారని తెలుసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ త‌న భ‌ర్త ఇద్ద‌రు క‌లిసి ఇంట్లో ఉన్న గోధుమ పిండి బిడ్డ‌లా చేసి ఒక గుడ్డ‌లో క‌ప్పి ద‌గ్గ‌ర‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లారు. అక్క‌డ ఉన్న‌ నర్సును ‘ఉదయ్‌ శ్రామిక్‌ సేవా సహాయత యోజన’ కింద తన బిడ్డ పేరును నమోదు చెయ్యాలని కోరింది.

అయితే, న‌ర్సు బిడ్డ‌ను ప‌రీక్ష చేసాక పేరు న‌మోదు చేస్తామ‌ని చెప్ప‌గా ఆ మ‌హిళ ససేమీరా అన‌డంతో..  వాగ్వాదానికి చోటుచేసుకుంది. అనుమానం వ‌చ్చిన న‌ర్సు వైద్య సిబ్బందికి చెప్పండ‌తో.. శిశువును చూడాలని వైద్యులు పట్టుబట్టంతో ఆమె నిరాక‌రించింది. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ ఆమె భ‌ర్త క‌లిసి వైద్య సిబ్బందితో గొడ‌వ‌ల‌కు దిగ‌గా ఆ మ‌హిళ చేతిలో ఉన్న గోధుమ ముద్ద కింద ప‌డిపోయింది. వెంటనే ఆ మహిళ తన బిడ్డను చంపేశారంటూ భర్తతో సహా అక్కడినుంచి ఉండాయించింది. దీంతో అస‌లు విష‌యం తెలుసుకున్న వైద్య సిబ్బంది,  చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ గుప్తా ఆశ్చర్యపోయి డ‌బ్బుల కోస‌మే ఇలా చేసింద‌ని భావించారు.