సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుపేద నుంచి కోటీశ్వరుని వరకు ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతారు. కోడి కొక్కొరొకో అనగానే నిద్ర లేచేవారు కొందరు. మరికొందరేమో.. కోళ్లను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కోడి పుంజులను పెంచడానికే నిద్ర లేస్తుంటారు. కోస్తా జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పుడు జరుగుతోంది ఇదే వాస్తవానికి కోళ్ల పందేల్లో ఇప్పుడంటే డబ్బుతో పందేలు కట్టి ఆడుతున్నారు కానీ.. పూర్వం అంటే సింధు నాగరికత కాలంలో కోళ్ల పందేలు వినోదం కోసం మాత్రమే జరిపేవాళ్లు. ఈజిఫ్టులో కూడా కోళ్ల పందేలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది.
ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడిపందేలు, గుండాటలు, పేకాటలూ ఆడేస్తున్నారు. భీమవరం లాంటి చోట్ల ఇవాళ్టి నుంచీ కోడి పందేలు నిర్వహిస్తున్నారు పందెం రాయుళ్లు. ఇక రేపు 14న భోగి పండుగ జరుగుతుంది కాబట్టి… పండగ రోజు కంటే ముందే కోడి పందేలు నిర్వహించాలని డిసైడయ్యారు. ఉదయం నుంచీ పందేలు జోరుగా సాగుతున్నాయి. బరులన్నీ పందెం రాయుళ్లు, కోడి పందేలను చూసేందుకు వచ్చే వారితో నిండిపోయాయి. అయితే కోడి పందేలతోపాటూ ఆ సారి బరుల చుట్టూ.. పేకాట, ముక్కాట, గుండాట, కొత్తగా కేసినో వంటి ఆటలకు కూడా వేలం వేశారు. ఇవాళ్టి నుంచీ నాలుగు రోజుల పాటూ ఈ కోడి పందేలు కొనసాగుతూనే ఉంటాయి.