మనం బయట ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ను చూసి అవి ఆరోగ్యానికి హానికరం అని భయపడుతుంటాం. కానీ మన ఇళ్లల్లో వంటగదిలో కూడా మనకు తెలియకుండా ఎన్నో విషపూరిత పదార్థాలు దాగి ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే బయటి ఫుడ్ ను మానుకోవడం ఒకటే మార్గం కాదు. ఇంట్లో మనం వాడే కొన్ని ఆహార పదార్థాలు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ విషాలు ఆహార పదార్థాల్లో మాత్రమే కాకుండా ఆహారాన్ని వండే పద్ధతుల్లో పాత్రలలో కూడా ఉండవచ్చు. కాబట్టి మనం తినే ప్రతి ఆహారపు ముద్ద గురించి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.
పాత నూనె వాడడం : మనం ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడడం చాలామందికి అలవాటు. ఇలా చేయడం వల్ల నూనెలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల వంటి సమస్యలకు దారితీస్తాయి. అందుకే వాడిన నూనె తిరిగి వాడకుండా ఉండాలి.
నాన్ స్టిక్ పాత్రలు : నాన్ స్టిక్ పాన్ లు వంటలు సులభం చేస్తాయి. కానీ వాటిపై ఉండే టెఫ్లాన్ పూత అధిక ఉష్ణోగ్రత వద్ద విరిగిపోయి విషపూరితమైన పొగలను విడుదల చేస్తుంది. ఇది శ్వాస కోస సమస్యలకు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది వాటికి బదులుగా తక్కువ వేడితో వండడం లేదా స్టీల్ పాత్రలను వాడడం మంచిది.

ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్ ఆహారం : మనం ఇంట్లో ఉంచుకునే కొన్ని ప్యాకెడ్ ఆహార పదార్థాల్లో ఎక్కువ మొత్తంలో ప్రిజర్వేటివ్స్ కలిగి వుంటాయి వాటిలో ఉప్పు, చక్కెర హానికరమైనవి. ఇవి ఊబకాయం, రక్తపోటు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. అందుకే రంగు కలిసిన వాటిని వాడకుండా ఉండడం ఉత్తమం.
పాలు గుడ్లు మాంసంనిల్వ: సరిగా నిల్వ చేయని పాలు, మాంసం, గుడ్లు వంటివి బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటాయి. ఇవి ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతాయి ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో సరైన ఉష్ణోగ్రత వద్ద శుభ్రంగా ఉంచాలి.
ఇక కూరగాయలు సరిగా కడగకుండా ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల ఎంతో బ్యాక్టీరియా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. లేదా కొంతమంది ఎక్కువకాలం ఫ్రిజ్ లో నిలువ చేసిన కూరగాయలను వాడతారు. ఇది కూడా ప్రమాదకరమే, ఫ్రిజ్ లో నిలువ చేసిన వెంటనే వాటిని వండుకోవడానికి కొంత సమయం ముందు బయట ఉంచాలి. ఆ తర్వాతే వాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, బయటి ఆహారంతో పాటు ఇంట్లో మనం వాడే వస్తువులు, పద్ధతుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత సరైన వంట పద్ధతులను పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.