ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ అంటూ నాన్‌వెజ్‌తో ఎంజాయ్ చేస్తారు. మరి శాఖాహారలకు స్పెషల్ ఏంటి. పప్పు, సాంబార్ తిని బోర్ ఫీలవుతున్నారా? మీరు కూడా నాన్‌వెజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా పుట్టగొడుగుల బిర్యానీ చేసుకొని నాన్‌వెజ్ ప్రియులను నోరూరించండి.
పుట్టగొడుగుల బిర్యాని కావాల్సినవి :
బాస్మతి బియ్యం : పావుకేజి
పుట్టగొడుగులు : పావుకేజి
నెయ్యి : 3 టేబుల్‌స్పూన్లు
నూనె : 3 టేబుల్‌స్పూన్లు
ఉల్లిగడ్డ : 1
పచ్చిమిర్చి : 2
టమాట : 1
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
బిర్యాని మసాలా : 1 టేబుల్‌స్పూన్
పెరుగు : పావుకప్పు
బిర్యాని దినుసులు : తగినన్ని
కొత్తిమీర, పుదీనా : సరిపడా
ఉప్పు : తగినంత.
నీరు : సరిపడా.
తయారీ :
గిన్నెలో నూనె, నెయ్యి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యాని దినుసులు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. దీంట్లో మసాలా, పెరుగు, పుట్టగొడుగులు వేసి అయిదు నిమిషాలు వేగాక తగినన్ని నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. నీళ్లు బాగా తెర్లేటప్పుడు బియ్యం వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు చిన్న మంటపై ఉంచాలి. పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక అంతే ఘుమఘుమలాడే పుట్టగొడుగుల బిర్యాని రెడీ! దీన్ని కుర్మాతో తింటే టేస్ట్ అదిరిపోతుంది.