నోరూరించే పానీపూరీ.. ఇంట్లోనే తయారు చేసుకొని ఆరగించండి..!

-

చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని.. పూరీలో ఇంత చాట్ వేసి.. ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే.. ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి.. టకా టకా ప్లేట్ లో పానీపూరీ వేస్తూనే ఉంటాడు. మనం ఆరగిస్తూనే ఉంటాం. అలా ఎన్ని వేసినా తింటూనే ఉంటాం. అంతలా నోరూరిస్తుంది పానీపూరీ. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు పానీపూరీ అనగానే నోరూరాల్సిందే. పానీపూరీని సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో గప్ చుప్ అని కూడా పిలుస్తారు. నార్త్ ఇండియాలో మాత్రం గోల్ గప్పా అని పిలుస్తారు.

panipuri recipe in telugu

ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ లో పూచ్కాస్ అని పిలుస్తారు. భారతదేశంలో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్ ఇది. అయితే.. కొన్ని పానీపూరీ సెంటర్ల నిర్వాహకులు పరిశుభ్రత పాటించరు. చేతులు కడుక్కోరు. దీంతో అక్కడ పానీపూరి తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఖాయం. అందుకే.. మీ ఇంట్లోనే శుభ్రంగా, టేస్టీగా పానీపూరీని తయారు చేసుకోవచ్చు. వాటిని తినడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా రావు. మరి.. ఇంట్లో పానీపూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి.

పానీపూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

చల్లని నీళ్లు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ(ఖర్జూర, చింతకాయతో చేసిన చట్నీ), కారం, చాట్ మసాలా పొడి, జిలకర్ర పొడి, బోంది, పూరీలు ఉంటే చాలు..

తయారు చేయు విధానం

గిన్నెలో చల్లని నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, కారం, చాట్ మసాలా పొడి, జిలకర్ర పొడిని కలపండి. ఖచ్చితంగా ఇంతే కలపాలి.. అనేదేమీ ఉండదు. మీకు నచ్చిన విధంగా… నీళ్లను బట్టి.. వాటిని కలుపుకోవచ్చు. టేస్టును బట్టి కొంచెం ఎక్కువ లేదంటే కొంచెం తక్కువ కలుపుకోవచ్చు. ఓ గంట సేపు ఆ మిశ్రమాన్ని అలాగే ఉండనివ్వండి. తర్వాత ఆ నీళ్లలో ఓ పిడికెడు బూందీ కలపండి. దీంతో మసాలా నీళ్లు రెడీ అయినట్టే.

పానీ పూరీల్లో వాడే పూరీలు బయట మార్కెట్ లో దొరుకుతాయి. మంచి క్వాలిటీ ఉన్న పూరీలు తీసుకుంటే అవి మసాలా నీళ్లు, చాట్ పట్టేంతగా ఉండేలా చూసుకోండి.

 

ఇక.. పూరీలో వేసే చాట్ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం…

దాని కోసం ఆలుగడ్డలు, పచ్చి మిర్చీ, కారం, జీలకర్ర పొడి, చాట్ మాసాలా, ఉప్పును రెడీగా పెట్టుకోండి. పెసర పప్పు(గుండ్లు), ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను పక్కన పెట్టుకోండి.

ఆలుగడ్డలను ఉడకపెట్టి పొట్టు తీసి దాన్ని వాటిని మెత్తగా చేయండి. దాంట్లో పచ్చి మిర్చీ, కారం, జిలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. దాన్ని పక్కన పెట్టండి.

అంతకుముందు రోజు రాత్రి పెసర పప్పును నానబెట్టండి. తెల్లారేసరికి అవి మొలకెత్తుతాయి. వాటిని ఉడకబెట్టి వడబోసి ఆ మిశ్రమంలో ఇంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి. ఒకవేళ మీదగ్గర పెసర పప్పు లేకపోతే.. పచ్చి శనగలతో కూడా చేసుకోవచ్చు. అంతే పానీపూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు రెడీ అయిపోయాయి.

ఇప్పుడు అన్నీ ఒకదగ్గర పెట్టి.. పూరీ తీసుకొని.. దాని మధ్యలో రంధ్రం చేసి దాంట్లో ఆలు మిక్స్, పెసరపప్పు మిక్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి కొంచెం కొత్తిమీర, సేవ్(కారపూస) వేసి ఇదివరకే రెడీ చేసి పెట్టుకున్న మసాలా నీళ్లలో ముంచి లాగించేయడమే. అలా.. ఇంట్లోనే పానీపూరీ చేసుకుని హ్యాపీగా సేదతీరుతూ ఎన్నంటే అన్ని పానీపూరీలను లాగించేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ ఇంట్లో పానీపూరీని తయారు చేసుకోండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version